Indian Railways: చైల్డ్ జర్నీ రూల్స్ మార్చిన రైల్వే శాఖ.. కట్‌చేస్తే.. రూ. 560 కోట్ల ఆదాయం..!
Child Travel Norms: సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్‌ఐఎస్) నుంచి వచ్చిన ప్రతిస్పందన ప్రకారం సవరించిన నిబంధనల ఫలితంగా 2022-23లో రైల్వేలు రూ. 560 కోట్లు ఆర్జించగలవని అంచనా వేసింది.
Indian Railways Rules: మీరు తరచుగా రైలులో ప్రయాణిస్తుంటే, కొన్ని నియమాలలో ఎప్పటికప్పుడు మార్పులను తెలుసుకోవాలి. పిల్లల ప్రయాణ నిబంధనలను మార్చడం ద్వారా భారతీయ రైల్వే గత ఏడేళ్లలో రూ.2,800 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించింది. ఆర్టీఐకి సమాధానంగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.
2022-23లో రూ.560 కోట్లు ఆర్జించిన రైల్వేలు..
సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్‌ఐఎస్) నుంచి వచ్చిన ప్రతిస్పందన ప్రకారం, సవరించిన నిబంధనల వల్ల 2022-23లో రైల్వేలు రూ. 560 కోట్లు ఆర్జించగలవని అంచనా వేసింది. ఈ విధంగా ఇది అత్యంత లాభదాయకమైన సంవత్సరంగా మారింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని CRIS, టికెటింగ్, ప్రయాణీకుల నిర్వహణ, సరుకు రవాణా సేవలు, రైలు ట్రాఫిక్ నియంత్రణ, కార్యకలాపాలు వంటి ప్రధాన అంశాలలో IT పరిష్కారాలను అందిస్తుంది.
ఈ నిబంధన ఏప్రిల్ 21, 2016 నుంచి అమల్లోకి వచ్చింది.
రైల్వే మంత్రిత్వ శాఖ మార్చి 31, 2016న ఐదేళ్ల నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు పూర్తి ఛార్జీలను వసూలు చేస్తుందని ప్రకటించింది. పిల్లలు రిజర్వ్ చేయబడిన కోచ్‌లో ప్రత్యేక బెర్త్ లేదా సీటు కావాలనుకున్నప్పుడు ఈ నియమం వర్తిస్తుంది. ఈ నిబంధన ఏప్రిల్ 21, 2016 నుంచి అమలులోకి వచ్చింది. ఇంతకుముందు రైల్వే ఐదు నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు సగం ఛార్జీలతో బెర్త్‌లు ఇచ్చేది. రెండో ఆప్షన్ ప్రకారం, పిల్లవాడు ప్రత్యేక బెర్త్ తీసుకోకుండా తన సంరక్షకుడితో ప్రయాణించినా, అతను సగం ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది.
CRIS 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 వరకు రెండు వర్గాల పిల్లల కోసం ఛార్జీల ఎంపికల ఆధారంగా గణాంకాలను అందించింది. ఈ ఏడేళ్లలో 3.6 కోట్ల మందికి పైగా పిల్లలు రిజర్వ్‌డ్ సీటు లేదా బెర్త్‌ను ఎంచుకోకుండా సగం ఛార్జీలు చెల్లించి ప్రయాణించినట్లు సమాచారం. మరోవైపు, 10 కోట్ల మందికి పైగా పిల్లలు ప్రత్యేక బెర్త్ లేదా సీటును ఎంచుకున్నారు. పూర్తి ఛార్జీలను చెల్లించారు. RTI దరఖాస్తుదారు చంద్రశేఖర్ గౌర్ మాట్లాడుతూ, 'రైల్వేలో ప్రయాణించే మొత్తం పిల్లలలో 70 శాతం మంది పూర్తి ఛార్జీలు చెల్లించి బెర్త్ లేదా సీటు తీసుకోవడానికి ఇష్టపడతారని కూడా సమాధానం చూపిస్తుంది.