ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు?

Exit Polls: ఐదేళ్లకు ఓ సారి నిర్వహించే సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ పూర్తి అయింది.

Update: 2024-06-01 12:00 GMT

ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు?

Exit Polls: ఐదేళ్లకు ఓ సారి నిర్వహించే సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ పూర్తి అయింది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే రెండు పర్యాయాల విజయం తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓటర్లు కొంత భిన్నంగా స్పందిస్తుంటారు. 2004,2009 తర్వాత 2014లో యూపీఏ సర్కార్‌ను ప్రజలు గద్దె దించి.. ఎన్డీఏకు పట్టం కట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సారి ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలపైకి మళ్లింది. ఇంతకూ ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు? వీటిలో కచ్చితత్వం ఎంత?

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్‌కు మరోసారి వేళయింది. మరి ఎగ్జిట్ పోల్స్ అంటే ఏమిటి? వాటిని ఎలా నిర్వహిస్తారు? ఎగ్జిట్ పోల్స్ చెప్పే లెక్కలు ఎంతవరకు నిజం అవుతాయి? అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. పోలింగ్ తర్వాత... ఫలితాలకు ముందు ఆయా సర్వే సంస్థలు,మీడియా సంస్థల అంచనాలనే ఎగ్జిట్ పోల్స్ అంటారు. పోలింగ్‌కు ముందు వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వెలువరించే అంచనాలను ప్రీ పోల్ సర్వే అంటారు.

ఎన్నికల సర్వేలకు అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్వాహకులు మొబైల్ ఫోన్, ఇతర సాధనాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. భారత్‌లో ఓటర్లను చాలా వరకు నేరుగా, క్షేత్రస్థాయిలో కలుస్తారు. ఎలక్షన్స్‌లో భాగంగా కొన్ని మీడియా సంస్థలతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రి పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అనే రెండు రకాల సర్వేలు నిర్వహిస్తుంటాయి. పోలింగ్ జరగడాని కంటే ముందు నిర్వహించే సర్వేలను ప్రీపోల్స్ అంటారు. అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు, పొత్తుల అంశం తేలక ముందు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకముందు, పార్టీలు అభ్యర్థులను ప్రకటించక ముందు, పోలింగ్ తేదీకి చాలా రోజుల ముందు, లేదా పోలింగ్ తేదీ సమీపించినప్పుడు నియోజకవర్గాల వారీగా ఈ ప్రీ పోల్ సర్వే నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా కొంతమంది ఓటర్లను ర్యాండమ్‌గా ఎంపిక చేసుకుని సర్వే చేస్తారు. అలా ఓటర్లతో మాట్లాడి.. ఏ పార్టీకి విజయావకాశలు ఎక్కువ ఉందనే విషయాన్ని సేకరించి పోల్ ఫలితాలు వెల్లడిస్తారు. ఎగ్జిట్ పోల్ సర్వే, ప్రి పోల్స్ సర్వేకు చాలా తేడా ఉంది. ప్రీపోల్ సర్వేలో రైతులు,ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, దివ్యాంగులు, ముసలివారు, మహిళలు, కులం, మతం, పేద, మధ్యతరగతి వంటి వర్గాలను ఎంచుకుని సర్వే నిర్వహిస్తారు. ఎగ్జిట్ పోల్స్ అలా కాదు పోలింగ్ రోజే ఓటు వేసేందుకు వచ్చిన వారిని మాత్రమే ప్రశ్నించి సమాధానం రాబడతారు. అందుకే... ప్రీ పోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితత్వానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పోలింగ్ జరిగే సమయంలో ఈ ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తారు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలకు ఆయా సంస్థల ప్రతినిధులు వెళ్తారు. వారు అక్కడ ఉన్న ఓటర్లు ఎక్కువమంది ఏ పార్టీకి ఓటు వేస్తారో ఒక అంచనాకు వస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సేకరించిన సమాచారంతో ఏ నియోజవర్గంలో ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉందో ఓ నిర్ణయానికి వస్తారు. అలా నియోజవర్గాల వారిగా వచ్చిన సర్వేతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఓ అంచనాకు వస్తారు.

ఎగ్జిట్ పోల్ అంచనాలు అసలు ఫలితాలకు దాదాపు దగ్గరగా ఉంటాయి. అలాంటి ఘటనలు అనేకం జరిగాయి. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. సర్వే నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు వేర్వేరు సమయాల్లో కలిసి వారి స్పందనను తెలుసుకుంటారు. కానీ ఈ ప్రక్రియను పకడ్బందీగా, విస్తృతంగా నిర్వహిస్తేనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ నామాత్రంగా చేస్తే.. ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కొన్ని సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ పూర్తి రివర్స్ గా ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌కు ఫలితాలు దగ్గరా ఉంటాయి.

2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఇలాంటి పరిస్థితికి స్థానిక అంశాలు ప్రధాన కారణం కావొచ్చు. రెండు ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్ శాతంలో తేడా స్వల్పంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం సంక్లిష్టంగా మారుతుంది. ఓటింగ్ శాతంలో వ్యత్యాసం అధికంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం అంత కష్టం కాదు. పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు ఎవరు గెలుస్తారు? అధికారాన్ని ఎవరు కైవసం చేసుకుంటారని చెప్పడం ఎగ్జిట్ పోల్స్‌కు కూడా అంతు పట్టకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఓ పార్టీ వైపు నిలిస్తే.. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రత్యర్థి పార్టీ వైపు నిలుస్తాయి.

పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు పార్టీలు సాధించే సీట్లలో తేడా అతి తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో 1 నుంచి ఐదులోపు సీట్లతో ఏదో ఒకపార్టీ విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రెండు పార్టీలు సమాన సీట్లు గెలుచుకుని హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇలా ప్రీ పోల్స్ కంటే ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు అసలు ఫలితాలను దాదాపుగా అంచనా వేసినా.. పూర్తి స్థాయిలో నిజం అవుతుందా అంటే కాదనే చెప్పాలి.  

Tags:    

Similar News