ఒక దశాబ్దం... ఒక మనిషి జీవితంలో పసిప్రాయం. అప్పుడప్పుడే లోకం పోకడ తెలిసే సమయం. ఇది ఒక జీవి జీవన ప్రయాణం. మరి సమాజాన్ని చైతన్యపరిచే ప్రసార సాధనానికి పదేళ్లు ఒక గొప్ప సందర్భం. ఛానల్ ప్రారంభం నుంచే తెలుగు న్యూస్ టెలివిజన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన హెచ్ఎంటీవీ పదేళ్ల ప్రస్థానానికి చేరుకుంది. ప్రజా సమస్యలపై పోరాడాలంటే చిత్తశుద్ధి ఉండాలంటూ... సమస్యలపై సమరశంఖాన్ని పూరిస్తూ... ప్రజలకు ఓ తోడులా, ఓ నీడలా వెన్నంటి నడుస్తున్న హెచ్ఎంటీవీ పదేళ్లు పూర్తిచేసుకుంది. జర్నలిజంపై నిబద్ధతతో... వార్తాప్రసారాల్లో కచ్చితత్వాన్ని పాటిస్తూ.. విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తోంది హెచ్ఎంటీవీ. తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలను అందుకుంటూ... వార్తా ప్రసారాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తోంది. సంప్రదాయ విలువలకు పెద్దపీట వేస్తూ, ప్రజలతో మమేకమవుతూ... సామాన్యుడి గొంతుకై వినిపిస్తూ... సదా మీ సేవలో సగర్వంగా సాగుతోంది. ఈ దశాబ్ద కాలంలో మేమేం చేశామో చెప్పుకోవడం మా బాధ్యత.
నవ సమాజ నిర్మాణం కోసం సాగుతున్న అందమైన కల.. నవ భారత నిర్మాణంలో పాలు పంచుకునేందుకు అడుగు ముందుకేస్తున్న వేళ. ఏ సమాజమైనా అభివృద్ధి కావాలంటే వనరులొక్కటే సరిపోదు.. వాటిని సవ్యంగా వినియోగించుకోడానికో చుక్కాని కావాలి. సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు ఓ వేదిక కావాలి. అందుకు బాధ్యతాయుతమైన మీడియా సహకారం అవసరం. ఆ ఆసంకల్పాన్నే చెప్పుకున్న హెచ్‌ఎంటీవీ పదేళ్లుగా నిర్వారామంగా కృషి చేస్తోంది. ఈ 10 వసంతాల కాలంలో ఎన్నో విజయాలను నమోదు చేసింది. ప్రజల గుండె చప్పుడుగా ప్రతిధ్వనించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు ఉప్పెనలై ఎగసినవేళ.. సమైక్య, ప్రత్యేక వాదాలతో రాష్ట్రం అట్టుడికిన వేళ.. ప్రజల మనోభావాలను కల్లోలంలోకి నెట్టేసిన వేళ.. ఒక బాధ్యతాయుత ప్రసార మాధ్యమంగా హెచ్ఎంటీవీ ప్రజాభిప్రాయ సేకరణకు నడుం బిగించింది. దశ-దిశ పేరిట మూడు ప్రాంతాల ప్రజలకు వారథిగా మారింది. వాస్తవ పరిస్థితిని శ్రీకృష్ణ కమిటీకి నివేదించింది.
సాహిత్యం మనసును రంజింప చేస్తుంది. మనిషి మానసికంగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది. తెలుగు జాతిని ప్రభావితం చేసిన ఎందరో కవులు, కథకులు ఉన్నారు. వారందరినీ పేరు పేరునా స్మరించి, 116 ఎపిసోడ్‌లతో వందేళ్ల కథకు వందనాలు పేరిట సరైన సాహితీ నివాళి సమర్పించింది హెచ్ఎంటీవీ.
గ్రామీణ ప్రజానీకం గుండె గొంతుకలోంచి ఉబికివచ్చిన గేయాలు... జానపదాల నుంచి యుగళ గీతాల దాకా.... సినీ సంగీత హరివిల్లు నుంచి నేపథ్య సంగీతం దాకా అన్ని పాటలు... మనసు పొరల్లొంచి పుట్టుకొచ్చినవే. అలాంటివెన్నో గీతాలు రాష్ట్రాన్ని ఉర్రూతలూగించేందుకు మార్మోగిన పాట అంటూ... హెచ్‌ఎంటీవీ మరోసారి వేదికైంది. జనపదాలుగా నాని... మరుగునపడ్డ కళలను ముందు తరాలకు పరిచయం చేసింది హెచ్ఎంటీవీ. వర్ధమాన గాయకులకు, ఔత్సాహిక గాయకులకు ప్రోత్సాహం కల్పిస్తూ మార్మోగిన పాటగా ప్రజల ఆదరాభిమానాలతో అజేయంగా ముందుకు సాగింది. మానసికోల్లాసం కలిగించింది. టెలివిజన్ చరిత్రలో శిఖరాగ్రాన నిలబెట్టే ఉద్దేశానికి మరోసారి పెద్ద పీట వేసింది.
జర్నలిజం అంటే వార్తాప్రసారాలు మాత్రమే కాదు... సామాజిక బాధ్యతా అని బలంగా నమ్ముతుంది హెచ్‌ఎంటీవీ. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తోంది. నిగ్గదీసి అడిగే నిరంతర వార్తా కథనాలతో ప్రజల్ని చైతన్యపరుస్తుంది. శంఖారావం, జనం మనం కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా నిలిచింది. సమాకాలీన ప్రాంతీయ, జాతీయ అంశాలపై చర్చలు నిర్వహిస్తూ వాస్తవ పరిస్థితులపై ప్రజలకు స్వతంత్ర భారతం రూపంలో అవగాహన కల్పిస్తోంది. వార్తల ఒరవడిలో కొట్టుకుపోకుండా సామాజిక బాధ్యతను భుజానికెత్తుకున్న హెచ్‌ఎంటీవీ.. న్యూస్ అండ్ వ్యూస్ అంటూ ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియచేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై సమగ్ర విశ్లేషణ శ్రీని వార్త విశ్లేషణ. సమాకాలీన అంశాలపై ఇన్‌డెప్త్ అనాలిస్‌తో శ్రీనివార్త జన హృదయాలను దోచుకుంది. ఇక జలం-జీవం కార్యక్రమంతో నీటి సంరక్షణ, భూగర్భజలాల సంరక్షణపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తుంది హెచ్‌ఎంటీవీ. రైతాంగానికి నీడలా ఉంటూ వ్యవసాయంలో కొత్త పద్ధతులను అందించే నేలతల్లి... వీటితో పాటుగా పల్లె ముచ్చట్లను మోసుకొని వచ్చే గ్రామీణ వార్తల సమాహారం... మన ఊరు మన వార్తలు. రాజకీయ సామాజిక అంశాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న జోర్దార్ వార్తలు. ప్రభుత్వ నిర్ణయాలు, సమస్యలపై విమర్శనాత్మక విశ్లేషణతో సాగే బిగ్‌స్టోరీ. కేవలం వార్తలే కాదు... సమగ్ర విశ్లేషనలతో పాటు ఎడ్యుకేషన్, బిజినెస్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సమ ప్రాధాన్యమిస్తోంది హెచ్ఎంటీవీ. లేటెస్ట్ మూవీ అప్‌డేట్స్, ప్రముఖుల జీవిత విశేషాలను ఆవిష్కరించే ఇంటర్వ్యూలు, విద్యార్థులకు విజయ సోపానంలాంటి సక్సెస్ మంత్ర. ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో సాగుతోంది హెచ్ఎంటీవీ ప్రస్థానం. తెలుగు న్యూస్ ఛానల్ చరిత్రలో కొత్త ఒరవడులకు, వినూత్న ఆలోచనలకు కేంద్రంగా నిలుస్తోంది.
ఇలా గుర్తు చేస్తూ పోతే హెచ్ఎంటీవీ విజయ సోపానంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే ఘట్టాలెన్నో ఎన్నెన్నో... సమాజాభివృద్ధికి అవసరమైన ప్రజా సంక్షేమం కోసం నడుస్తోంది హెచ్ఎంటీవీ.. ఈ పయనంలో ఆటు పోట్లు ఎదురయినా.. లక్ష్యం గురి తప్పదు.. ప్రజాభిమానం, సహాయ సహకారాలే ఊపిరిగా అడుగు ముందుకు వేస్తూ మరిన్ని సాహసోపేత విజయాలు సాధించాలని తపన పడుతోంది. ప్రసార మాధ్యమాలు బాధ్యతగా ప్రవర్తించినప్పుడు ప్రభుత్వాల పని సులభమవుతుంది.. అదే లక్ష్యంతో, దీక్షతో హెచ్ఎంటీవీ అడుగు ముందుకేస్తోంది. ప్రజలకు సదా మీ సేవలో అంటూ సగర్వంగా నిలుస్తోంది.