Bathukamma Festival 2022: మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Bathukamma Festival 2022: తెలంగాణలో ఊరూ వాడా పూలజాతర సందడి చేస్తోంది.
Bathukamma Festival 2022: తెలంగాణలో ఊరూ వాడా పూలజాతర సందడి చేస్తోంది. తీరొక్క జానపదాలు పడతుల కంఠంలో తియ్యగా జాలువారుతున్నాయి. తెలంగాణలో ఏ ముంగిట చూసినా బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది. బతుకమ్మ పండుగలో భాగంగా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు వైభవంగా కొనసాగుతాయి. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా అందరూ సంబురాల్లో మునిగి తేలుతున్నారు.
తెలంగాణలో పెత్తరమాస అని పిలుచుకునే మహాలయ అమవాస్య రోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలైంది. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఇలా రోజుకో రీతిలో నైవేద్యాలు మారుతుంటాయి. పితృకార్యాలు నిర్వహించిన తర్వాత బతుకమ్మను పేర్చుతారు. అందుకే దీనికి 'ఎంగిలి బతుకమ్మ' అనే పేరొచ్చింది. బతుకమ్మను పేర్చడానికి సేకరించిన పూలను పవిత్రమైనవిగా భావిస్తారు. పూలను కూడా అంతే పవిత్రంగా ఒకరోజు ముందే సేకరిస్తారు. పూలను బతుకమ్మగా పేర్చేటప్పుడు కత్తితో కోసినా, నోటితో కొరికినా ఆ పూలు ఎంగిలవుతాయి. పూర్వకాలంలో కొందరు మహిళలు నోటితో కొరికి పేర్చడంతో అప్పటి నుంచి పెత్తరమాస సందర్భంగా ఆడే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారని ఓ ప్రతీతి.
పెళ్లి కావాల్సిన వారు పండుగ తొలిరోజు నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మను గౌరమ్మగా కొలిస్తే మంచి భర్త వస్తాడని, సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్మకం. మరుసటి రోజయిన పాడ్యమి నుంచి మహిళలందరూ శుచీశుభ్రతతో రోజంతా ఉపవాసం పాటించి బతుకమ్మను తయారు చేస్తారు. ఆ తర్వాత రోజుల్లో అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, చివరగా సద్దుల బతుకమ్మతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.