సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎన్నడూ
లేనివిధంగా ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. రోజురోజుకీ
వేడెక్కిస్తున్నాడు. కనీస ఉష్ణోగ్రతలు సరాసరిని మించి
నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పగలు
45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు రాత్రి
సమయంలోనూ ౩౦ డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
ఇది ఇంతకు ముందెన్నడూ చూడని పరిస్థితి. పగటి
ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనా.. రాత్రి సమయంలో
25 డిగ్రీల లోపులోనే ఉండేవి. ఈ సంవత్సరం రాత్రి
ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల కనిపిస్తుండడంతో జనం
అల్లాడిపోతున్నారు. రాబోయే రోజుల్లో మరింత వేడిమిని
భరించాల్సి వస్తుందని వాతావరణ శాఖ అధికారులు
చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో ఇప్పటికే వడదెబ్బకు
గురై మరణాలు సంభవిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఇదే
కొనసాగితే రాబోయే కాలం లో మరింత కష్టం తప్పదు.
తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు
చెబుతున్నారు. వారు సూచిస్తున్న జాగ్రత్తలివే..
ఎండలో బయటకు వెళ్లొద్దు..
వీలైనంత వరకు ఉదయం పది గంటల తరువాత నుంచి
సాయంత్రం 5 గంటలవరకు బయటకు వెళ్ళకపోవడమే
శ్రేయస్కరం. తప్పని సరిగా వెళ్ళాల్సి వచ్చిన వారు తగిన
జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టోపీ
ధరించడం, చలువ అద్దాలు పెట్టుకోవడంతో పాటు
వీలైనంతవరకు శరీర అవయావాలను ఎండపడకుండా
కప్పుకునేలా చూసుకోవాలి. తప్పనిసరిగా మంచి నీటిని
కుడా తీసుకువెళ్ళాలి. వీలైతే నీటిలో కొద్దిగా ఉప్పు లేదా
పంచదార కలుపుకుని తీసుకుంటే మంచిది.
ఏసీ నుంచి ఒక్కసారిగా బయటకు రావొద్దు..
చాలా మంది ఏసీ గదిలో నుంచి బయటకు వచ్చి నడిచి
లేదా బైక్ పై రహదారుల పైకి వెంటనే వచ్చేస్తారు. ఇది
ప్రమాదకరం. ఒక్కసారిగా తగిలే ఎండ తీవ్రతకి మెదడు
తట్టుకునే పరిస్థితి ఉండదు. కళ్ళు తిరిగడం లేదా
ఒక్కసారిగా శరీరం అదుపు తప్పటం జరుగవచ్చు.
అందువల్ల ఏసిలో ఉండి బయటకు వచ్చే సమయంలో గది
నుంచి బయటకు రాగానే కనీసం 5 నుంచి పది
నిమిషాల పాటు ఎటూ కదలకుండా బయటి
వాతావరణంలో వేచి చూడాలి. తరువాత రోడ్డు పైకి
వెళ్ళాలి.
ఆహార నియమాలు పాటించాలి..
వేపుళ్ళు.. మసాలా పదార్థాలకు ఈ సమయంలో
దూరంగా ఉండాలి. వీలైనంత వరకు తేలికగా జీర్ణమయ్యే
ఆహారాన్ని తీసుకోవాలి. నీటిని ఎలానూ ఎక్కువ
తాగుతారు కానీ, సాధ్యమనంతవరకు అతి చల్లని నీరు
తాగకుండా ఉంటె మంచిది. మద్యపానానికి దూరంగా
ఉండడం తప్పనిసరి. మద్యం సేవిస్తే డిహైడ్రేషన్ కు
గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
బయట తిరిగే ఉద్యోగాల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా
ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం
గంటకోసారన్నా నీడ పట్టున పది నిమిషాల పాటు
సేద్తిరాలని చెబుతున్నారు.
తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎండ వలన కలిగే
అసౌకర్యం నుంచి బయట పడొచ్చని నిపుణులు
సూచిస్తున్నారు.