Fathers Day 2020: నాన్నకు వందనం!
అమ్మ ఊపిరి పోస్తే.. నాన్న జీవితపు ఉషస్సులను చూపిస్తాడు. అమ్మ గోరుముద్దలతో కడుపు నింపితే.. నాన్న తర్జనితో ప్రపంచపు జీవనచిత్రాన్ని చూపిస్తాడు అమ్మ కడుపున దాచుకుని మోస్తే..నాన్న భుజాలపైకి ఎక్కించుకుని జీవితపు ఎత్తు పల్లాలను కళ్ళ ముందుంచుతాడు!
ఒక్కరోజు స్మరణతో పోయే బంధం కాదది. ఒకే రోజు తలుచుకుని చెప్పుకునే అనుబంధం కాదది. ఊపిరి తీసుకున్న క్షణం నుంచి.. జీవితపు చివరి అంచుల వరకూ అన్నిదశాల్లోనూ ప్రభావితం చేసే శక్తి అది. నాన్న.. రెండక్షరాలు.. కానీ ఆ శబ్దం ఇచ్చే అనుభూతి ప్రతి తండ్రికి ఓ మధురస్మృతి. ప్రతి తయునికి జీవిత కాలపు పెన్నిధి. ఫాదర్స్ డే 2020 సందర్భంగా అందరికీ శుభాకాంక్షల అక్షరాల మాల వేస్తోంది హెచ్ఎంటీవీ.
తన జీవితాన్ని త్యాగం చేసే ప్రతి కొడుకు, కూతురు జీవితంలో నాన్న పాత్ర మరువలేనిది. మహనీయమైనది నాన్న ఎప్పుడూ పిల్లల గుండెల్లో ఉంటాడు. అదే మనం నాన్నకు ఇచ్చే గౌరవం. పిల్లలను ఎవరినైనా మీ ఇంట్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే చాలా మంది పిల్లల నుంచి వచ్చే సమాధానం ఎంటో తెలుసా.. నాకు మానాన్న అంటే చాలా ఇష్టం అని చెపుతారు. మరికొంత మంది నాకు మా అమ్మ అంటే ఇష్టం అని చెపుతుంటారు. అమ్మ 9 నెలలు మనల్ని తన కడుపులో మోసి కంటుంది. అదే నాన్న పిల్లలు పుట్టిన నాటి నుంచి వారి భవిష్యత్తుకోసం ఆలోచిస్తారు. పిల్లల్ని జీవితంలో ఎదిగేవరకూ మోస్తూనే ఉంటారు. ప్రతి క్షణం పిల్లలు చేసే తప్పును సరిదిద్దుకుంటూ వారిని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారు. అది తన బాధ్యతగా ఫీల్ అవుతాడు.
అసలు పిల్లలకు ఎదగడం అంటేకూడా ఏంటో తెలియని చిన్నతనం నుంచే పిల్లలు వేసే తప్పటడుగులను సరిదిద్దుతూ ఉంటారు. ఆ సమయంలో పిల్లలకు నాన్న అంటే కోపం వచ్చినా అది కాసేపే ఉంటుంది. మళ్లీ నాన్న దగ్గరికే వెలుతుంటారు. తండ్రి కూతురి విషయంలో కాస్త శాంతంగా ఉన్నప్పటికీ కొడుకుల విషయంలో కాస్త కఠినంగానే ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఓ తండ్రి కూతురిని తన తల్లిలా భావిస్తారు. కొడుకు విషయంలో కూడా తండ్రి బాధ్యత నేర్పాలి అనుకుంటారు. కొడుకులు సమాజంలో ఎలా మెదలాలి, ఎదగాలో నేర్పిస్తాడు. అది కొడుకు ఎదుగుదలకేగా ఎంతకష్టమైనా తాను భరించాలనుకుంటాడు. అందుకే నాన్న ఇంటికి మూలస్తంభం.. ఇప్పటికీ.. ఎప్పటికీ.
ఇక పిల్లలు పుట్టిన నాటి నుంచి ప్రతి క్షణం పిల్లలతో ఎప్పుడూ ఉండకపోవచ్చు కానీ ఎప్పుడూ పిల్లల మంచే కోరుతారు. తన రక్తం పంచుకుని పుట్టిన పిల్లలని ఎంతగానో ప్రేమిస్తాడు. నాన్న తన పిల్లల నుంచి ఆశించేది డబ్బు కాదు.. ఆస్తులు కాదు.. అంతస్తులు కాదు.. కాసింత ప్రేమ మాత్రమే. అది కొడుకైనా, కూతురైనా మంచి పేరు తెచ్చుకోవాలనే చూస్తారు. నాన్న లేకపోతే పిల్లలకు వాళ్ల జీవితమే లేదు. అలాంటి పిల్లలు ఎదికి ఒక స్ధాయిలో ఉన్నారు అంటే అది కూడా కేవలం తండ్రి చలవే. అందుకే ఏమిచ్చినా తండ్రి తన పిల్లలకు ఇచ్చిందాన్ని తీర్చుకోలేం, వారి రుణాలను తీర్చుకోలేనిది. అటువంటి నాన్నకు ఒక రోజు సరిపోదు. సంవత్సరం మొత్తం నాన్న రోజులే ఉండాలి.
అంతర్జాతీయ పితృ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు. ఆ తరువాత అలా అలా ఈ నాన్నల వందన దినోత్సవమునకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి.