Rain Alert: ఎంత వర్షం కురిసిందో ఎలా లెక్కిస్తారు.? ఎల్లో, రెడ్‌ అలర్ట్స్‌ అంటే ఏంటో తెలుసా..?

Rain Alert: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమన కారణంగా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి.

Update: 2024-10-17 05:56 GMT

Rain Alert: ఎంత వర్షం కురిసిందో ఎలా లెక్కిస్తారు.? ఎల్లో, రెడ్‌ అలర్ట్స్‌ అంటే ఏంటో తెలుసా..?

Rain Alert: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమన కారణంగా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. చెన్నై ఇప్పటికీ అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ పలు జిల్లాలను అలర్ట్‌ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న చోట్ల ఎల్లో, రెడ్‌ అలెర్ట్‌లు జారీ చేసింది. అయితే అసలు ఎంత వర్షం కురిసిందన్న విషయాన్ని ఎలా లెక్కిస్తారు.? వాతావరణ శాఖ అలర్ట్స్‌ను ఏ ప్రాతిపదికన వెల్లడిస్తుంది. ఇందులో ఉన్న అసలు లాజిక్‌ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఒక ప్రాంతంలో వర్షం కురిసిన సమయంలో సమతలంపై నీరు ఎంత వరకు చేరుకుందో దాని ఆధారంగా ఎంత వర్షం కురిసిందన్న విషయాన్ని లెక్కకడుతారు. ఇందుకోసం వాతావరణ శాఖ అధికారులు రెయిన్‌ గేజ్‌ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ గేజ్‌లో నేరుగా వర్షం నీరు పడడం ద్వారా అందులోని మీటర్‌ ఎంత వర్షం పడిందో సూచిస్తుంది. మిల్లీమీటర్లలో ఇంత వర్షం కురిసిందన్న విషయాన్ని లెక్కిస్తారు. ఈ రెయిన్‌ గేజ్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సాధారణ కంటైనర్‌ లాంటిది. రెండోది ఆటోమేటిక్‌గా వర్షపాతాన్ని రికార్డ్ చేసే టూల్​. ఇది వర్షం పడిన టైం, వర్షపాతం మొత్తం వంటి వివరాలను రికార్డ్ చేస్తుంది.

ఇక వాతావరణ శాఖ విడుదల చేసే అలర్ట్‌ల విషయానికొస్తే.. ఏదైనా ఒక ప్రదేశంలో 24 గంటల వ్యవధిలో 6.4సెంటీ మీటర్ల కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటే వాతవరణ శాఖ అధికారులు గ్రీన్‌ అలర్ట్‌ను జారీ చేస్తారు. అయితే దీనివల్ల పెద్దగా ఎలాంటి నష్టం ఉండదని సాధారణ వర్షపాతం ఉంటుందని అర్థం చేసుకోవాలి.

ఒకవేళ 6.45 సెంటీ మీటర్ల నుంచి 11.55 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసే అవకాశాలు ఉంటే ఎల్లో అలర్ట్‌ను జారీ చేస్తారు. ఈ అలర్ట్‌ జారీ చేస్తే వాతావరణం కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అర్థం. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు, మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. ఎల్లో అలర్ట్ జారీ చేస్తే జాగ్రత్తగా ఉండాలని అర్థం.

ఇక ఆరెంజ్‌ అలర్ట్ విషయానికొస్తే 24 గంటల వ్యవధిలో 11.56 సెంటీమీటర్ల నుంచి 20.44 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అర్థం. ఈ అలర్జ్‌ చేస్తే ప్రమాదం పొంచి ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌ అవ్వాల్సిందే. ఇక మూడోది రెడ్‌ అలర్ట్‌. 24 గంటల వ్యవధిలో ఒక ప్రదేశంలో 20.45 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉంటే ఈ అలర్ట్‌ను జారీ చేస్తారు. అత్యంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటేనే ఈ అలర్ట్‌ను జారీ చేస్తారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్న అర్థం ఈ అలర్ట్‌ చెబుతుంది. రెడ్ అలర్ట్ జారీ అయితే దాదాపు ఐదు రోజుల పాటు అమల్లో ఉంటాయి.

Tags:    

Similar News