Coronavirus Effect On Rents: పోలీసులకు అద్దె కష్టాలు
Coronavirus Effect On Rents|◆ ఇంటి అద్దె వివాదాలపై ఫిర్యాదుల వెల్లువ ◆ కరోనా ప్రభావంతో పేరుకుపోయిన అద్దె బకాయిలు ◆ సర్ధిచెప్పేందుకు పోలీసుల తంటాలు
◆ ఇంటి అద్దె వివాదాలపై ఫిర్యాదుల వెల్లువ
◆ కరోనా ప్రభావంతో పేరుకుపోయిన అద్దె బకాయిలు
◆ సర్ధిచెప్పేందుకు పోలీసుల తంటాలు
Coronavirus Effect On Rent | కరోనా మహమ్మారి దెబ్బకు పరిశ్రమలు మూతబడ్డాయి.. వ్యాపారాలు దివాళా తీశాయి.. కోట్లాది మంది ఉద్యోగాలు ఉన్నఫళంగా ఊడిపోయాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అన్ని రంగాల వారిని అధోగతి పాలయ్యేలా చేసిన కరోనా వైరస్ ధాటికి యావత్ ప్రపంచం చిన్నాభిన్నమైంది. వైరస్ బారినపడిన వారు ప్రాణాల కోసం పోరాటం చేస్తుంటే, ఉపాధి కోల్పోయి వీధినపడిన వారు దిక్కుతోచనిస్థితిలో భారంగా జీవనం సాగిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక, చేద్దామంటే పని దొరక్కపోవడంతో కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న అభాగ్యుల కన్నీటి గాధలను ప్రతిరోజూ చూస్తూనే వున్నాం. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు అత్యధికంగా ఉన్న మనదేశంలో అద్దె ఇళ్లలో తలదాచుకుంటున్నవారే అధికం.
ఇంటి అద్దె, నిత్యావసరాలు, వైద్య ఖర్చులతో సహా అన్నింటినీ పరిమిత సంపాదనలోనే సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో కరోనా వచ్చిపడింది. లాక్ డౌన్ కష్టాలతో కుటుంబ పోషణ కష్టమైన తరుణంలో సగటుజీవికి ఇంటి అద్దె మోయలేని భారంగా మారింది. అప్పోసప్పో చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ, నెలల తరబడి అద్దె బకాయిపడిన వారికి యజమానుల నుండి ఒత్తిడి పెరిగింది. కరోనా కాలంలో పేరుకుపోయిన బకాయిల విషయంలో అద్దెకుంటున్నవారికి, ఇళ్ల యజమానులకు అద్దె యుద్ధాలు పెచ్చుమీరాయి. కష్టాల్లో వున్నాం.. ఇప్పటికిప్పుడు అద్దె కట్టలేం.. ఉన్నఫళంగా ఖాళీ చేయమంటే మావల్ల కాదంటూ.. అద్దెకుండేవారు తమ బాధను వ్యక్తం చేస్తుండగా, అద్దెలపై ఆధారపడిన తమకు నెలల తరబడి బాకీలు పెడితే ఎలాగంటూ ఇళ్ల యజమానులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అద్దె వివాదాలకు ఇళ్ల వద్ద పరిష్కారం లభించకపోవడంతో, అద్దెకున్నవాళ్లు, ఇళ్ల యజమానులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
అద్దె కోసం వేధిస్తున్నారంటూ అద్దెకుండేవాళ్లు ఆరోపిస్తుండగా, నెలల తరబడి అద్దె చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఇళ్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలోనూ అద్దె ఫిర్యాదులు ప్రతిరోజూ నమోదవుతూనే ఉన్నాయి. ఇంటి అద్దె వివాదాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో, వాటిని పరిష్కరించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులకు అద్దె కష్టాలొచ్చిపడ్డాయి. సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలంటూ, ఇరు వర్గాల వారికి సర్ధిజెప్పి పంపటం పోలీసు అధికారులకు కత్తి మీద సాములా తయారైంది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి చక్కబడేంత వరకూ అందరూ సంయమనం పాటించాలని, స్నేహపూర్వక వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలని పోలీసు అధికారులు హితవు పలుకుతున్నారు.