Coronavirus Effect : గణపతి విగ్రహాల తయారీపై కరోనా ఎఫెక్ట్

Update: 2020-07-16 04:14 GMT

Coronavirus Effect : గణపతి విగ్రహాల తయారీపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా భయంతో అమ్ముడు పోతాయో లేదో అని చాలా చోట్ల విగ్రహాల తయారీ నిలిచిపోయింది. గణేశ్ ఉత్సవాలకు పర్మిషన్‌ ఉంటుందా లేదా అని ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. పరిస్థితి ఇట్లనే ఉంటే ఏడాదంతా తమకు పస్తులే అని కళాకారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై ఆధారపడి జీవించే కళాకారుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది.

బోనాల పండుగ తర్వాత అత్యంత వైభవంగా జరుపుకునేది వినాయక చవితి ఉత్సవాలు. పదకొండు రోజులపాటు విధి విధిలో పూజలందుకుంటాడు. భక్తులు భిన్న ఆకృతుల్లో విగ్రహాలను ప్రతిష్టిస్తుంటారు. ఇందుకోసం మూడు నెలల ముందుగానే విగ్రహాలను ఆర్డర్ చేసి మరీ తయారు చేయించుకుంటారు. భాగ్యనగరంలో ధూల్‌పేట పరిసర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో విగ్రహాలు తయారవుతాయి. ఆ ప్రాంతాల్లో ఉండే 95శాతం మంది ప్రజలు ఇదే జీవనాధారంగా చేసుకుని ఏళ్ల తరబడి జీవిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఇప్పటి వరకు పది ఆర్డర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక హైదరాబాద్‌ గణేష్ ఉత్సవాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. అలాంటి ఈ ఏడాది గణేష్ ఉత్సవాలపై కరోనా నీడలు కమ్ముకున్నాయి. కనీసం వీధుల్లో పెట్టుకునే వినాయక మండపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఫలితంగా ఈ ప్రభావం విగ్రహాల తయారీదారులపై తీవ్రంగా పడింది. వీటిపై ఆధారపడి జీవనోపాది పొందే రోజువారీ కూలీల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా మారింది.

విగ్రహాల తయారీ తగ్గిపోవడంతో దానికి అనుబంధంగా నడిచే వ్యాపారాలు సన్నగిల్లాయి. విగ్రహాలను తరలించే ట్రాలీ ఆటోలో, డీసీఎం వాహనాలు, డికరేషన్ వ్యాపారం, నిమజ్జనం సందర్భంగా శోభయాత్రకు వచ్చే బ్యాండ్‌ వాయిద్య కళాకారులు, విగ్రహాలను ఉపయోగించే గ్రిల్స్‌ తయారీ రంగాలపై కూడా ప్రభావం పడింది. గణేష్ ఉత్సవాల్లో నాలుగు రాళ్లు సంపాదించుకుందామనుకున్న వారి ఆశలు ఆడియాశలే అయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఖైరతాబాద్ వినాయక విగ్రహ ఎత్తును తగ్గించే యోచనలో ఉత్సవ కమిటీ ఉన్నట్లు వెల్లడించారు.

మొత్తంగా ఇందుగలడందులేడని సందేహంబు వలదన్నట్లు కరోనా ప్రభావం లేని చోటు కనిపించడం లేదు. మహమ్మారి ధాటికి అర్థిక రంగాలు కుదేలైయ్యాయి. అనేక మంది జీవితాలు రోడ్డునపడ్డాయి. ఇప్పుడు వినాయక చవితిపై కూడా కరోనా ఎఫెక్ట్‌ భారీగా చూపించే అవకాశాలు ఉండటంతో అందరు అసంతృప్తింగా ఉన్నారు.

Tags:    

Similar News