Corona Updates in India: ఏ ఒక్కరిని వదలని కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
Corona Updates in India: కంటికి కనిపించని కరోనా వైరస్.. ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తుంది. గత ఆర్నెళ్లుగా సామ్యానుల నుంచి ప్రముఖుల వరకు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది
Corona Updates in India: కంటికి కనిపించని కరోనా వైరస్.. ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తుంది. గత ఆర్నెళ్లుగా సామ్యానుల నుంచి ప్రముఖుల వరకు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఇటు.. మన దేశంలోనూ కరోనా ఉధృతి శరవేగంగా ఉంది. ఈ వైరస్‌కు చిక్కకుండా ఉండేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యపడటం లేదు. అత్యంత సురక్షితంగా ఉండే రాజకీయ నేతలు,సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు సైతం ఈ వైరస్ బారిపడి, ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కరోనా పేరు చెబితే హడలిపోతున్నారు.
నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ కరోనా బారిన పడగా.. నేడు తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆయన కూతురు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. యడ్యూరప్ప ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యడ్యూరప్ప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అలాగే కాంగ్రెస్ మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం కరోనా బారిన పడ్డారు.
మరోవైపు.. ఏపీలో మాజీ మంత్రి, యూపీ విద్యాశాఖామంత్రులు కరోనా బారినపడి చనిపోయారు. కర్నాటక సీఎం బీఎస్. యడ్యూరప్ప ట్విట్టర్ ద్వారా తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన వారందరినీ స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. చికిత్స కోసం ఆయన బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్‌లోని మణిపాల్ దవాఖానలో చేరారు. '
మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కరోనా బారినపడ్డారు. అలాగే తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అలాగే .. ఏపీ, తెలంగాణల ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనాబారిన పడ్డారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా రావడంతో హోం ఐసోలేషన్లో చికిత్స అందుకుంటున్నారు.
దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 52,972 కేసులు వెలుగులోకి వచ్చాయి. 771 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18 లక్షలను దాటింది. ఇప్పటిదాకా 18,03,696 లక్షల కేసులు నమోదు అయ్యాయి. 38,135 మంది మరణించారు. డిశ్చార్జి అయిన వారి సంఖ్య సైతం భారీగా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. దేశవ్యాప్తంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 12 లక్షలకు చేరువైంది. ఇప్పటిదాకా 11,86,203 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,79,357గా నమోదైంది. కరోనాకు మందు వచ్చే వరకూ .. వ్యక్తిగతంగా ఎవ్వరికి వారే తగిన జాగ్రత్తలు తీసుకోవడమే శ్రేయస్సుకరం.