Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే.. ఇస్రో ఏం చేస్తుంది? మిషన్ మూన్ ప్లాన్ బి ఏంటో తెలుసా?

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) చంద్రయాన్-3 ఆగస్టు 23 బుధవారం నాడు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

Update: 2023-08-22 12:30 GMT

Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే.. ఇస్రో ఏం చేస్తుంది? మిషన్ మూన్ ప్లాన్ బి ఏంటో తెలుసా?

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) చంద్రయాన్-3 ఆగస్టు 23 బుధవారం నాడు చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ మిషన్ విజయవంతమవడంతో, భారతదేశం అంతరిక్ష రంగంలో పెద్ద ఎత్తుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. చంద్రునిపై విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్‌తో, US, USSR, చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో నాల్గవ దేశంగా అవతరిస్తుంది. అదే సమయంలో చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రపంచంలోనే మొదటి దేశం అవుతుంది.

చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి, చంద్రునిపై భారతదేశం సాఫ్ట్ ల్యాండింగ్ చేసే ఈ రెండవ ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగితే లేదా ల్యాండర్ మాడ్యూల్‌కు సంబంధించిన ఏదైనా సమస్య ఏర్పడితే, ల్యాండింగ్ ఆగస్టు 27కి వాయిదా వేయనున్నట్లు ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సోమవారం తెలిపింది.

ల్యాండర్ మాడ్యూల్ పనితీరు, చంద్రునిపై ఆ సమయంలో ఉన్న పరిస్థితుల ఆధారంగా ల్యాండింగ్‌కు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని అహ్మదాబాద్‌కు చెందిన ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం. దేశాయ్ తెలిపారు. ఆగస్ట్ 23న చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండ్ కావడానికి రెండు గంటల ముందు, ల్యాండర్ మాడ్యూల్ పనితీరు బట్టి ఆ సమయంలో ల్యాండ్ చేయడం సముచితమో కాదో నిర్ణయిస్తామని డైరెక్టర్ దేశాయ్ చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.

ఏదైనా అంశం అనుకూలంగా కనిపించకపోతే, మాడ్యూల్ ల్యాండింగ్‌ను ఆగస్టు 27కి వాయిదా వేస్తామని ఆయన తెలిపారు. అయితే అదే సమయంలో, చంద్రుని ల్యాండింగ్‌లో ఎటువంటి సమస్య ఉండకూడదని, ఆగస్టు 23న చంద్రునిపై చంద్రయాన్-3 మాడ్యూల్‌ను విజయవంతంగా దించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, చంద్రయాన్-3 మిషన్‌లోని 'ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా' (ఎన్‌పీడీసీ) ద్వారా సంగ్రహించిన చంద్రుడి ఫొటోలను ఇస్రో మంగళవారం విడుదల చేసింది. ఈ చంద్రుని ఫొటోలు ఆగస్టు 19న సుమారు 70 కి.మీ ఎత్తు నుంచి తీసినట్లు తెలిపింది.

LPDC నుంచి తీసిన చిత్రాలు మిషన్‌లోని ల్యాండర్ మాడ్యూల్ (LM) వాహనంలోని చంద్రుని రిఫరెన్స్ మ్యాప్‌తో సరిపోలడం ద్వారా దాని స్థానాన్ని (అక్షాంశం, రేఖాంశం) గుర్తించడంలో సహాయపడతాయని ఇస్రో తెలిపింది. LM బుధవారం చంద్రుని ఉపరితలంపై 'సాఫ్ట్ ల్యాండింగ్' చేసే అవకాశం ఉంది.

'ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ ఎవిడెన్స్ కెమెరా' (ఎల్‌హెచ్‌డీసీ) నుంచి తీసిన చంద్రుని వెనుక వైపు ఫొటోలను ఇస్రో సోమవారం విడుదల చేసింది. అహ్మదాబాద్‌కు చెందిన 'స్పేస్ అప్లికేషన్ సెంటర్' (SAC) అభివృద్ధి చేసిన ఈ కెమెరా, రాళ్లు లేదా లోతైన కందకాలు లేని చోట కిందికి దిగేటప్పుడు సురక్షితమైన 'ల్యాండింగ్' ప్రాంతాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. SAC అనేది ISRO ప్రధాన పరిశోధన, అభివృద్ధి కేంద్రం.

'అన్నీ విఫలమైతేనే చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ విజయవంతమవుతుంది'

ఈ నెల ప్రారంభంలో, ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని సెన్సార్లు, రెండు ఇంజన్లు పని చేయకపోయినా, ల్యాండింగ్ ఖాయమని ఆయన పేర్కొన్నారు. విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుడిపై విజయవంతంగా దిగనుంది అని ఆయన ఉద్ఘాటించారు.

అన్నీ విఫలమైతే, సెన్సార్లన్నీ ఫెయిల్ అయినా ప్రొపల్షన్ సిస్టమ్ బాగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత చంద్రయాన్-3ని జులై 14న ప్రయోగించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News