Model Code Of Conduct: దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. దీని అర్థమేంటి?
Model Code Of Conduct: ఎన్నికల పండుగ రానే వచ్చేసింది.
Model Code Of Conduct: ఎన్నికల పండుగ రానే వచ్చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే అతిపెద్ద పండుగ. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నోటిఫికేషన్‌ను ఈసీ ఇవాళ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ను ఇవాళ విడుదల చేసింది. షెడ్యూల్ విడుదల కావడంతో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. నేటి నుంచి ఖర్చు పెట్టే ప్రతీ రూపాయిని పార్టీలు అభ్యర్థులు ఎన్నికల సంఘానికి లెక్కలు చూపించాల్సి ఉంటుంది. ఐతే.. చాలా మందికి ఎన్నికల కోడ్ అంటే ఏంటో తెలియదు. ఇది అమల్లోకి వస్తే, వచ్చే మార్పులేంటో తెలుసుకుందాం.
1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు.. తొలిసారిగా ఎన్నికల నియమావళి అనేది అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో అధికారులు.. రాజకీయ పార్టీలకు ఒక నియమావళిని పెట్టేందుకు ప్రయత్నించాయి. అప్పటి నుంచి ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఎన్నికల కోడ్ అమలవుతూ, రకరకాల మార్పులతో.. అది ప్రస్తుతం కీలకమైనదిగా మారింది.
ఎన్నికల కోడ్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన నియమావళి. దీన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులూ పాటించాల్సి ఉంటుంది. తమ ప్రచారాల్లో వారు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించినట్లు ఎన్నికల సంఘం భావిస్తే, హెచ్చరికలు చేస్తుంది లేదా FIR కూడా నమోదు చేస్తుంది. పార్టీ పై, అభ్యర్థిపై FIR రాయించగలదు. అందువల్ల పార్టీలూ, అభ్యర్థులూ ఎన్నికల కోడ్‌ని పాటించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఇకపై కొత్త పథకాలు ప్రకటించకూడదు. అలాగే అధికారంలో ఉన్న పార్టీలు.. ఆ అధికారాన్ని తమ ఎన్నికల ప్రచారానికి వాడుకోకూడదు.