Top 6 News Of The Day: బురద రాజకీయాలు చేయొద్దన్న సీఎం.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్

Update: 2024-09-02 13:00 GMT

Top 6 News Of The Day, Heavy rains in Telangana and Andhra Pradesh, Vijayawada receives heavy rainfall

కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోండి..

తెలంగాణలో వరద సహాయక చర్యలపై మాజీ మంత్రి హరీష్‌రావు.. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేశారు. రాష్ట్రంలో కుండ‌పోత‌గా కురిసిన వ‌ర్షాల‌కు ప్రజలు కష్టాల్లో ఉన్నారని, సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఇంట్లో వరద నీరు.. క‌ళ్లల్లో ఎడతెగని కన్నీరు ప్రవ‌హిస్తుంద‌న్నారు. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని హరీష్‌ రావు ఆవేద‌న వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడంపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని హ‌రీశ్‌రావు సూచించారు.

ప్లీజ్.. బురద రాజకీయాలు చేయొద్దు..

బురద రాజకీయాలకు స్వస్తి పలకాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. ప్రకృతి విపత్తులు వస్తే రాజకీయాలు సరికాదన్నారు. బెయిల్ వస్తే 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు.. కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే బయటకు రావడం లేదన్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారించామని తెలిపారు. రాష్ట్రంలో 5 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశామని చెప్పారు. నష్టాన్ని పరిశీలించేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించామని... సాయం చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. తక్షణ సాయం కింద కేంద్రం 2వేల కోట్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విజయవాడ అతలాకుతలం

కుండపోత వాన, వరదలకు విజయవాడ అతలాకుతలం అయింది. ముంచెత్తిన వరదలతో పట్టణం జలదిగ్బందంలో చిక్కుకుంది. కాలనీలు మొత్తం చెరువులుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా భుజాలకుపైనే వరద నీరు నిలిచిపోయింది. విజయవాడ ప్రాంతం అంతా ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇంట్లో వరద నీరు.. బాధితుల కంట్లో కన్నీరుతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. సర్కార్‌ ముందుస్తు చర్యలతో కొంతమేర ప్రాణ, ఆస్తి నష్టం తప్పినా.. ముంపు ముప్పుతో బాధితులు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటు సర్కార్ కూడా.. సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఆహారం, వాటర్, మందులను పంపిణీ చేస్తున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు రంగంలోకి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మొన్న సిసోడియా, నిన్న కేజ్రీవాల్, ఇవాళ ఖాన్..

ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్‌లో నియామకాలతో పాటు వక్ఫ్ బోర్డుకి చెందిన రూ.100 కోట్ల ఆస్తులను లీజ్‌కి ఇచ్చే విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అమానతుల్లా ఖాన్‌ని అదుపులోకి తీసుకున్నారు. అమానతుల్లా ఖాన్ అరెస్ట్ అనేక నాటకీయ పరిణామాల మధ్య చోటుచేసుకుంది. అరెస్ట్ కంటే ముందుగా అమానతుల్లా ఖాన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సెబీ చీఫ్‌ మాధబి పురీ బుచ్‌‌కి రెండు జీతాలు

సెబీ చీఫ్‌ మాధవి పురీ బుచ్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. ఆమెపై కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా ఉంటూ ఆమె ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వేతనం తీసుకుంటున్నారంటూ ఆరోపించింది. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాలకిందకే వస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ నేత పవన్‌ ఖేడా వ్యాఖ్యానించారు. ఇది ప్రజా సేవల్లో నైతికత, జవాబుదారీతనాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. ఒక కంపెనీలో పనిచేస్తూ ఒకచోట మాత్రమే వేతనం తీసుకోవాల్సి ఉంటుందని పవన్‌ అన్నారు. అలాంటిది సెబీ చీఫ్‌ విషయంలో అలా జరగడం లేదన్నారు. సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్న మాధబి ఐసీఐసీఐ బ్యాంక్‌, ప్రుడెన్షియల్‌ నుంచి వేతనం అందుకుంటున్నారని ఆరోపించారు.

భారీ వర్షాలు.. ఆ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. పరిస్థితిని బట్టి ఆ తర్వాత తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో విద్యాసంస్థలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు, వరద ముప్పుతో ముందు జాగ్రత్తగా కలెక్టర్ నాగలక్ష్మి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్ష సూచన ఉన్న మరికొన్ని జిల్లాలలో కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.

Tags:    

Similar News