Top 6 News Of The Day: గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసులు కీలక సూచనలు.. మరో టాప్ 5 హెడ్‌లైన్స్

Update: 2024-09-06 12:45 GMT

ఆర్టికల్ 370 గురించి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా బీజేపి అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంకల్ప పత్ర పేరుతో బీజేపి మేనిఫెస్టో విడుదల చేశారు. జమ్ముకశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపి 25 హామీలను పొందుపరిచింది. అందులో మొదటిగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని, ప్రతేకవాదాన్ని సమూలంగా నివారిస్తాం అని బీజేపి హామీ ఇచ్చింది. ఆ తరువాతి స్థానంలో మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు మహిళలు వారి కాళ్లపై వాళ్లు నిల్చునేలా వారికి సాధికారత కల్పించనున్నట్లు హామీనిచ్చింది. ఈ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ ఆర్టికల్ 370 గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్‌

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్‌ను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తైంది. కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్‌ను కొత్త పీసీసీ చీఫ్‌గా నియమించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ మధ్య పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రమైన పోటీ ఉండగా అధిష్టానం మాత్రం మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది. పార్టీలో అందరిని సమన్వయం చేస్తారని మహేష్ కుమార్ గౌడ్‌కు పేరుంది.

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు పొడి వాతావరణమే ఉన్నప్పటికీ ఆ తరువాత క్షణాల వ్యవధిలోనే ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, షేక్ పేట, రాయదుర్గం, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, నాంపల్లి, ఖైరతాబాద్, లక్డీకాపూల్, మెహిదీపట్నంతో పాటు సిటీలోని అనేక ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షం ధాటికి రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. సాయంత్రం వేళ ఉద్యోగులు విధులు ముగించుకునే వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కాంగ్రెస్‌లో చేరిన వినేష్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు

రెజ్లర్స్ వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వినేష్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు కష్టకాలంలో అండగా నిలిచిందని అన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై జరుగుతున్న న్యాయ పోరాటాన్ని ఉద్దేశించి వినేష్ ఫోగట్ మాట్లాడుతూ.. తమ పోరాటం ఇంకా ముగియలేదన్నారు. న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెబుతూ.. ఈ పోరాటంలో నా సోదరీమణులకు తాను అండగా ఉంటానన్నారు. మీకు ఎవ్వరు ఉన్నా.. లేకున్నా.. మీ కోసం తాను పోరాడుతానని హామీ ఇచ్చారు. ఇంతకాలం రెజ్లింగ్‌లో ఎలాగైతే మనసు పెట్టి కృషి చేశామో.. అలాగే ప్రజలకు సేవ చేసేందుకు కూడా రాజకీయాల్లో అంతే మనసు పెట్టి పనిచేస్తానని ఫోగట్ అభిప్రాయపడ్డారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం

వరదలతో తీవ్రంగా న‌ష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 3 వేల 300 కోట్ల ఆర్ధిక సహాయం ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను.. సెంట్రల్ మినిస్టర్ శివరాజ్‌సింగ్ చౌహాన్ పర్యటించారు. నీట మునిగిన కాలనీల్లో బాధితులతో మాట్లాడారు. వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నీటమునిగిన పంటల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఆదుకుంటే.. దేవుడికి పూజలు చేసినట్టేనని శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. అన్నట్టుగా వరద నష్టాన్ని కేంద్రానికి తెలిపిన వెంటనే కేంద్రం 3 వేల 300 కోట్లు వరద సాయం కింద ప్రకటించింది.

గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసులు కీలక సూచనలు

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్‌ సిద్ధమవుతోంది. అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించేందుకు మండపాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రేపటి నుంచి 17వ తేదీ వరకు గణేష్ చతుర్థి జరగనుంది. ఈ నేపథ్యంలోనే గణేష్ మండపాల నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, భారతీయ నాగరిక్ సురక్ష సంమిత ప్రకారం గణేష్ మండపాల కోసం నిర్వాహకులందరూ ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. గణేష్ మండపాలు ఏర్పాటు సమయంలో అన్ని జాగ్రత్తలు, సూచనలు పాటిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News