TOP 6 News @ 6PM: 'సోషల్ మీడియాలో అడ్డగోలు పోస్టులు పెడితే సహించేది లేదు': మరో 5 ముఖ్యాంశాలు
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

1. 214 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చాం: బీఎల్ఏ
తమ చెరలో ఉన్న214 మంది పాకిస్తాన్ సైనికులను చంపినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ తెలిపింది. తమ రాజకీయ ఖైదీల విడుదలకు పాకిస్తాన్ సైన్యానికి 48 గంటల సమయం ఇచ్చినా కూడా పట్టించుకోలేదని బీఎల్ఏ ప్రకటించింది. శత్రు సైన్యానికి చెందిన 214 మందిని హతమార్చినట్టు బీఎల్ఏ తెలిపింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ బోగీల్లోని బందీలను రక్షించేందుకు వచ్చిన ఎస్ఎస్ జీ కమాండోలపై తమ దళాలు దాడి చేసినట్టు ఆ సంస్థ ప్రకటించింది.
2. డీఆర్ఐ అధికారులపై రన్యారావు ఆరోపణలు
తనను డీఆర్ఐ అధికారులు పలుమార్లు చెంపపై కొట్టారని నటి రన్యారావు ఆరోపించారు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువచ్చారని ఆరోపణలతో రన్యారావు అరెస్టయ్యారు. విచారణ సమయంలో డీఆర్ఐ అధికారులు తనతో తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకున్నారని ఆమె చెప్పారు. చెప్పినట్టు వినకపోతే తన తండ్రిని కూడా ఈ కేసులో ఇరికిస్తారని బెదిరింపులకు దిగారని రన్యారావు తెలిపారు.
3. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే చర్యలు: రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వాళ్లు వాడే భాషను చూస్తే రక్తం మరిగిపోతోందన్నారు. ప్రజా జీవితంలో ఉన్నందున ఓపిక పడుతున్నానని ఆయన అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టించిసోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టారని ఆయన చెప్పారు. ఎవరు పడితే వాళ్లు చానెల్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్లు జర్నలిస్టులు అవుతారా అని ఆయన ప్రశ్నించారు.
4. కార్యకర్తలు ఎప్పుడూ నా వెంటే ఉన్నారు:చంద్రబాబు
కార్యకర్తలు ఎప్పుడు తన వెంటే ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబునాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో నాయకులు, కార్యకర్తలు, తనతో సహా అందరూ ఇబ్బందిపడ్డారని చెప్పారు. తెలుగుదేశానికి పటిష్టమైన యంత్రాంగం ఉందని ఆయన గుర్తు చేశారు. 41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్తున్నానని ఆయన తెలిపారు.పార్టీ పరంగా కార్యకర్తల గౌరవాన్ని పెంచాలన్నారు.
5. ఏడు రోజులు జైల్లో ఉన్నా: అమిత్ షా
అసోంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తాను ఏడు రోజులు జైల్లో ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. విద్యార్థి దశలో ఆందోళనల సమయంలో తన పట్ల కఠినంగా వ్యవహరించారన్నారు. ఏడు రోజుల పాటు తనను జైల్లో పెట్టారని ఆయన అన్నారు. అసోంలో హితేశ్వర్ సైకియా ప్రభుత్వం ఉన్న సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
6. జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: హరీశ్ రావు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ జి. ప్రసాద్ ను తమ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అగౌరవంగా మాట్లాడలేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు. ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని స్పీకర్ ను కోరారు. స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తమ పార్టీ సహకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ పై పున: పరిశీలించాలని ఆయన కోరారు.