శ్రీలంకలో ఎమర్జెన్సీ.. భారీ సాయం అందించిన భారత్
Sri Lanka Crisis: పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు.
Sri Lanka Crisis: పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఉన్నపళంగా ఎమర్జెన్సీ విధించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. విదేశీ కరెన్సీ నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో దిగుమతులు ఆగిపోయాయి. అందులో కీలకమైన ఆయిల్ దిగుమతులు నిలిచిపోవడంతో శ్రీలంకలో ప్రజాజీవనం స్తంభించిపోయింది. 11 నుంచి 15 గంటలపాటు ఏకబిగిన కరెంట్ పోవడంతో ప్రజలంతా అల్లాడిపోయారు. ఆగ్రహావేశాలతో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. అధ్యక్షుడు గొటబయ ఇంటిని ముట్టడించారు. తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొనడమే గాక.. పాలకుల ఉనికికే ముప్పు వాటిల్లడంతో రాజపక్స ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్ని కంట్రోల్ చేసేందుకు సైన్యానికి పూర్తి అధికారాలిచ్చారు గొటబయ.
కనిపించినవారిని, అనుమానితులను కారణాలు చూపకుండానే అరెస్టు చేయవచ్చు. ఎన్ని రోజులైనా నిర్బంధంలో ఉంచవచ్చు. అయితే శ్రీలంకను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మళ్లీ ఇండియానే ముందుకు రావడం విశేషం. పవర్ క్రైసిస్ నుంచి బయట పడేసేందుకు శ్రీలంకలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 6 వేల మెట్రిక్ టన్నుల చమురు సప్లయి చేసేందుకు ముందుకొచ్చింది. ఇక ఆహార కొరత తీర్చేందుకు ఇండియన్ ట్రేడర్స్ 40 వేల టన్నుల ఆహార ధాన్యాలు సప్లయి చేసేందుకు ఒప్పుకున్నారు. శ్రీలంకకు చైనా నమ్మకద్రోహం చేసిందని, ఇప్పటిదాకా భారత్ కు వ్యతిరేకంగా శ్రీలంకలో పెట్టుబడులు పెట్టిన చైనా.. ఇలాంటి సంక్షోభం సమయంలో పతా లేకుండా పోవడం విమర్శలకు తావిస్తోంది. అదే సమయంలో భారత్ నుంచి ఆపన్నహస్తం అందడం పాజిటివ్ సంకేతంగా భావిస్తున్నారు.