బీహార్ లో నితీష్‌కు అసలు సినిమా ఇకపై కనిపిస్తుందా..?
బీహార్ ఎన్నికలు ముగిశాయి. నితీష్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని అందరూ అంటున్నారు. అయితే, అసలు రాజకీయం ముందుందనిపిస్తోంది.
ఎన్నికలు ముగిశాయ్. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది మళ్లీ బిహార్‌లో ! ఇకపైనే ఉందా అసలు సినిమా ! నితీష్ సీన్ సితార కావడం ఖాయమా ? ఆ ఎనిమిది మందే కీలకంగా మారారా.. ఆదివారం ఎన్డీఏ సమావేశంలో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయ్ ?
ఐపీఎల్ ఫైట్‌ను తలపించిన బిహార్ ఎన్నికల్లో సెకండ్ పార్ట్ షురూ అయింది. నువ్వానేనా అన్నట్లు సాగిన ఎన్నికల సమరంలో చివరికి ఎన్డీఏ అధికారాన్ని దక్కించుకుంది. ఐతే పెద్ద తేడా ఏం కాదు. దీంతో బిహార్ పాలిటిక్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయ్. మెజారిటీ తక్కువగా ఉండడంతో నితీష్ కుమార్‌కు సిసలైన అగ్ని పరీక్ష ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ మోస్తరు మెజారిటీతో ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన ఆయన రాజకీయ చతురతకు, వ్యూహాలకు ఈ ఐదేళ్ల పదవీకాలం ముళ్ల కిరీటంలా మారడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. పదవుల పంపకాల్లో ఏ మాత్రం తేడా కొట్టినా ప్రభుత్వం మైనారిటీలో డే ప్రమాదం ఆయన ముందు కనిపిస్తోంది.
బిహార్‌లో మేజిక్ ఫిగర్ 122కాగా అంతకంటే కేవలం మూడు సీట్లు మాత్రమే ఎక్కువ సాధించింది ఎన్డీఏ. బీజేపీ 74 స్థానాల్లో విజయం సాధించగా జేడీయూ 43చోట్ల విజయం సాధించింది. ఎన్డీఏతో పొత్తు కుదుర్చుకున్న హిందుస్తాన్ ఆవామీ మోర్చా, వికాస్ శీల్ ఇన్సాఫ్ పార్టీ నాలుగేసి చోట్ల విజయాలు సాధించాయ్. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకుంటేనే మేజిక్ ఫిగర్ క్రాస్ అవుతోందిప్పుడు ! ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కానీ బయటకు వస్తే నితీష్ సర్కార్ మైనారిటీలో పడే అవకాశం ఉంటుంది.
ఏ లెక్కన చూసినా కత్తిమీద సాములాగే ఉంది నితీష్ పరిస్థితి ! ఇలాంటి పరిణామాల మధ్య జేడీయూ, బీజేపీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చా, వికాల్ శీల్ ఇన్సాఫ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఆదివారం పాట్నాలో సమావేశం కాబోతున్నారు. మంత్రి పదవుల కేటాయింపుపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐతే కేబినెట్ బెర్తులు అడిగి తీరుతామని ఇప్పటికే హెచ్ఏఎం అధ్యక్షుడు మాంఝీ స్పష్టం చేశారు. మరి ఏ పోర్టుఫోలియోలు అడుగుతారు వారు ఓకే చెప్తారా.. అంత సవ్యంగా జరిగితే ఓకే మరి తేడా కొడితే పరిస్థితి ఏంటన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
ఇంతకుముందు బిహార్‌కు సీఎంగా పనిచేసిన మాంఝీ ఇప్పుడు మంత్రివర్గంలో పనిచేసే అవకాశాలు కనిపించడం లేదు. ఐతే తనకు స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఐతే ఈ పొత్తులపై పరిణామాలపై చర్చ జోరుగా సాగుతున్న వేళ మాంఝీ ఓ క్లారిటీ ఇచ్చారు. ఇంతకుముందు నితీష్‌తో ఉన్నాం ఇకపై కూడా ఉంటామని చెప్పారు.