వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి ఆ సేవలకు ఎక్కువ చెల్లించాల్సిందే..!
Motor Insurance: మీరు కొత్త కారు లేదా బైక్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీకోసమే.
Motor Insurance: మీరు కొత్త కారు లేదా బైక్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఏప్రిల్ 1 నుంచి మీరు కొత్త కారు-బైక్‌పై ఇన్సూరెన్స్ కోసం మరింత చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త కార్లు, బైక్‌లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు థర్డ్ పార్టీ బీమా కోసం 17 నుంచి 23 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ బీమా రెగ్యులేటర్ (IRDAI)తో సంప్రదించి FY 2022-23కి థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత రేటును ప్రకటించింది. పరిశ్రమ నుంచి వచ్చిన సూచనలను అనుసరించి కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2022 నుంచి వర్తిస్తాయి.
మోటారు వాహన చట్టం ప్రకారం.. రోడ్డుపై తిరిగే ప్రతి వాహనానికి తప్పనిసరిగా థర్డ్ పార్టీ బీమా ఉండాలి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. సెప్టెంబర్ 2018 నుంచి విక్రయించే ప్రతి కొత్త 4 వీలర్‌కు తప్పనిసరిగా 3 సంవత్సరాల థర్డ్ పార్టీ బీమా, 2 వీలర్‌కు 5 సంవత్సరాల 3 సంవత్సరాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది వాహనం విక్రయించే సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో కొత్త వాహనం కొనుగోలుపై థర్డ్ పార్టీ బీమాను పెంచే భారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల 1500 సీసీ వరకు వాహనం కొనుగోలు చేసే వారు థర్డ్ పార్టీ బీమా కోసం రూ.1200 కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 150 సీసీ వరకు ఉన్న ద్విచక్ర వాహనానికి వినియోగదారుడు రూ.600 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రైవేట్ కార్ల కోసం వాటి ఇంజన్ సామర్థ్యాన్ని బట్టి పెరుగుదల ₹7 నుంచి 195, ద్విచక్ర వాహనాలకు ₹58 నుంచి ₹481 వరకు పెంపుదల ప్రతిపాదించారు. 75 నుంచి 150 cc బైక్‌లకు ₹ 38 తగ్గింపు కూడా సూచించారు. వాణిజ్య వస్తువుల వాహనాలపై స్వల్ప పెంపును ప్రతిపాదించారు. 1 ఏప్రిల్ 2020 నుంచి మోటార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రేట్లను 10-15% పెంచే ప్రతిపాదన ఉంది. కానీ కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత రేట్లు మారలేదు. 2021లో బీమా నియంత్రణ సంస్థ IRDAI కోవిడ్ కారణంగా థర్డ్ పార్టీ మోటార్ బీమాను మార్చలేదు.