రెగ్యులర్ రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు

*కొవిడ్‌కు ముందు దేశవ్యాప్తంగా 13 వేల పైచిలుకు నడిచే రైళ్లు *2020 మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలు రద్దు *అనేక రూట్లలో డిమాండ్‌కు తగ్గట్లుగా లేని రైలు

Update: 2021-01-17 09:06 GMT

లాక్ డౌన్ నుంచి ఆగిపోయిన రెగ్యులర్‌ రైళ్లు మళ్లీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయా అని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నడిపిస్తున్న ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. దీని ప్రకారం రెగ్యులర్‌ రైళ్లు ఏప్రిల్‌, ఆ తర్వాతే అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కొవిడ్‌కు ముందు దేశవ్యాప్తంగా రైళ్లు రెగ్యులర్‌ సర్వీసులు రోజుకు 13 వేల పైచిలుకు నడిచేవి. లాక్‌డౌన్‌తో 2020 మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకల్ని రద్దుచేసిన రైల్వేశాఖ మే నెల నుంచి దశలవారీగా పట్టాలు ఎక్కిస్తూ వస్తోంది. వీటిని ప్రత్యేక ట్రైన్లుగానే నడుపుతోంది. చాలా వాటిల్లో బెర్తులు వారం, పదిరోజుల ముందే నిండుతున్నాయి. అనేక రూట్లలో డిమాండ్‌కు తగ్గట్లుగా ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు.

సాధారణ స్థితిలో అన్ని రైళ్లు నడిపితే నిత్యం 2.30 కోట్ల మందిని చేరవేయాల్సి ఉంటుంది. బెర్తులు, సీట్లతో నిమిత్తం లేకండా ప్రయాణికులు కిక్కిరిసిపోతారు. కొవిడ్‌కు టీకాలు వేయడం శనివారం నుంచి ప్రారంభమైనప్పటికీ, సాధారణ ప్రజలకు, అన్ని వయసుల వారికి అందుబాటులోకి వచ్చేసరికి సమయం పడుతుంది. దాంతో రెగ్యులర్ రైళ్లను నడపడం అసాధ్యమంటున్నారు రైల్వేశాఖ అధికారులు.

తిరిగేది అదే మార్గం.. అవే బోగీలు.. ప్రయాణ సమయం కూడా అదే. రైల్వేశాఖ మాత్రం రెగ్యులర్‌ రైళ్లనే ప్రత్యేక బండ్లుగా నడిపిస్తోంది. ఈ నిర్ణయంతో రాయితీ ప్రయాణం పూర్తిగా పోయింది. సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులు వంటి వివిధ వర్గాలకు రైలు ప్రయాణం గతంతో పోలిస్తే భారంగా మారింది. హైదరాబాద్‌ నగరంలో అటు ఎంఎంటీఎస్‌ రైళ్లకు, చుట్టుపక్కల జిల్లాల నుంచి సబర్బన్‌ సర్వీసులకు ఇంకా అనుమతివ్వలేదు.

Tags:    

Similar News