పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతు.. కళ్లు చెదిరే విజయాన్ని అందుకుంటోన్న..
పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతయింది. ప్రజా వ్యతిరేక పవనాల్లో కమలం కొట్టుకునిపోయింది. కాంగ్రెస్ కళ్లు చెదిరే విజయాన్ని అందుకుంటోంది. ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ బీజేపీ ఖాతా తెరవని పరిస్థితి నెలకొని ఉందంటే.. మూడు వ్యవసాయ చట్టాలపై అక్కడి రైతుల్లో నెలకొన్న ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్ధమౌతోంది. మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
పంజాబ్‌లో ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు, 109 మున్సిపాలిటీలకు ఈ నెల 14వ తేదీన నిర్వహించిన ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం వెలువడుతున్నాయి. 71 శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైనప్పుడే బీజేపీకి ఓటమి తప్పకపోవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. దానికి అనుగుణంగా అనేక చోట్ల బీజేపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయాన్ని అందుకుంటున్నారు. అనేక డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో ముందంజలో కొనసాగుతోన్నారు. మోగ, హోషియార్‌పూర్, కపుర్తలా, అబొహర్, పఠాన్‌కోట్, బటాలా, భటిండా మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ హవా వీస్తోంది.