Pune Porsche Accident: పుణె పోర్షే కారు ప్రమాదంలో ఇద్దరి మృతి: మైనర్లు కార్లు నడపవచ్చా?

Pune Porsche Accident: పుణెలో పోర్షె కారును 17 ఏళ్ల మైనర్ బాలుడు అతి వేగంగా నడిపి ఇద్దరి మరణానికి కారణమయ్యాడు.

Update: 2024-05-21 07:24 GMT

Pune Porsche Accident: పుణె పోర్షే కారు ప్రమాదంలో ఇద్దరి మృతి: మైనర్లు కార్లు నడపవచ్చా?

Pune Porsche Accident: పుణెలో పోర్షె కారును 17 ఏళ్ల మైనర్ బాలుడు అతి వేగంగా నడిపి ఇద్దరి మరణానికి కారణమయ్యాడు. మరణించిన వారిని మధ‌్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనీష్ అవైదియా, ఆశ్విని కోస్టాలుగా గుర్తించారు.వీరిద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పుణెలో పనిచేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టుగా పుణె సిటీ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ చెప్పారు. ఈ కేసును కళ్యాణి నగర్ పోలీస్ స్టేషన్ నుండి క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు.ఇటీవలనే 12వ తరగతి పరీక్షల్లో నిందితుడు ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో స్నేహితులతో కలిసి ముంద్వా ఏరియాలోని బార్ లో మద్యం సేవించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

సంఘటన స్థలంలోనే బాధితులు మృతి

సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అనీష్ అవైదియా, ఆశ్విని కోస్టాలుగా ఆదివారం నాడు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో బైక్ పై వెళ్తున్న సమయంలో కళ్యాణినగర్ జంక్షన్ వద్ద పోర్షె కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్ పై నుండి ఎగిరిపడి వీరిద్దరూ అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారు అతి వేగంగా నడిపినట్టుగా పోలీసులు చెప్పారు.ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షులు కారులో ఉన్నవారిని చితకబాదారు. సమాచారం అందుకుని పోలీసులు అక్కడికి చేరుకున్నారు.కారును నడిపిన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ప్రమాదం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మైనర్లు వాహనాలు నడపొచ్చా?

మైనర్లు వాహనాలు నడపవద్దని చట్టాలు చెబుతున్నాయి. కానీ, నిర్లక్ష్యంగా వాహనాలను మైనర్లకు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మోటారు వాహనాల చట్టంలో కొత్త నిబంధనలను చేర్చారు. మైనర్లు ప్రమాదాలు చేస్తే ఆ ప్రమాదాలకు మైనర్ల పేరేంట్స్ లేదా వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తారు. పుణె ప్రమాదంపై మైనర్ బాలుడి తండ్రిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ 75,77 ప్రకారంగా కేసు నమోదు చేశారు.

మహారాష్ట్రలో ఏ వయస్సు వారికి మద్యం అందించవచ్చా?

మహారాష్ట్రలో 25 ఏళ్లు నిండిన వారికే మద్యం సరఫరా చేసేందుకు అనుమతి ఉంది. కానీ, మైనర్లకు బార్ లో ఎలా మద్యం సరఫరా చేశారనే విషయమై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనర్లకు బార్ లేదా పబ్ లో మద్యం సరఫరా చేయడం చట్ట విరుద్దం.ఈ కారణంగా బార్ యజమానిపై కూడ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం లేకపోలేదు.

ప్రమాదంపై వ్యాసం రాయాలని కోర్టు ఆదేశం

పుణె ప్రమాదానికి కారణమైన మైనర్ బాలుడిని పోలీసులు జువైనల్ కోర్టులో హాజరుపర్చారు. నిందితుడికి కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ప్రమాదంపై వ్యాసం రాయాలని సూచించింది. అంతేకాదు 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని కోర్టు సూచించింది.నిందితుడిని మేజర్ గా గుర్తించాలని పుణె పోలీసులు కోర్టును అభ్యర్ధించారు. కానీ, పోలీసుల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా మానవ తప్పిదాలే ఎక్కువ కారణమని నిపుణులు చెబుతున్నారు. లగ్జరీ వాహనాలు సెకన్ల వ్యవధిలో వేగాన్ని అందుకుంటాయి.ఇలాంటి వాహనాలను మైనర్లకు ఇవ్వడం ద్వారా తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా కొంతమేరకు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం రియాక్షన్

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. పుణె పోర్షే కారు ప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి చెందిన ఘటనపై ఆయన మంగళవారం నాడు స్పందించారు. ఇద్దరి మృతికి కారణమైన మైనర్ బాలుడికి 15 రోజుల శిక్ష విధించడం దిగ్ర్బాంతి కలిగించిందన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో ఫడ్నవీస్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

పుణె పోర్షే ప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి చెందిన యువకుడికి 15 రోజుల జైలు శిక్ష విధించడం దిగ్భ్రాంతికరమని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసుపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.తీవ్రమైన నేరమై ఉండి నిందితుడు 16 ఏళ‌్లు దాటి ఉంటే అతడిని మేజర్ గా పరిగణించవచ్చన్నారు.

Tags:    

Similar News