మాస్క్ పెట్టుకోలేదని.. మహిళను రోడ్డుపై ఈడ్చి కొట్టిన పోలీసులు
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో ఓ మహిళను ఆమె కూతురి ముందే చితకబాదారు పోలీసులు.
Madhya Pradesh: సెకండ్ వేవ్ వస్తుందనే హెచ్చరికలు వచ్చినా.. పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు.. పరిస్ధితి చేయి దాటిపోయాక మాత్రం తమ ప్రతాపం ప్రజలపై చూపిస్తున్నారు. అసలే జీవితాలు తలకిందులైపోయి.. వారి ఆశలు, ఆకాంక్షలు మట్టిలో కలిసిపోతుంటే.. నిస్సహాయ స్ధితిలో పడిపోయారు జనం. అలాంటివారిని మాస్క్ పెట్టుకోలేదేన్న కారణంతో చితకబాదితే.. అది ఎలా కరెక్టనే ప్రశ్న వస్తుంది. అలాంటి ఘటనే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో జరిగింది.
మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో ఓ మహిళను ఆమె కూతురి ముందే నడిరోడ్డుపై పడేసి, ఆమె జుట్టును లాగుతూ కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు స్మార్ట్‌ఫోన్‌లో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కుమార్తెతో కలిసి సరుకులు కొనుక్కుని వెళ్లడానికి బయటకు వెళ్లింది. ఆమె మాస్కు ధరించకపోవడాన్ని చూసిన పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడానికి వాహనం ఎక్కాలని చెప్పారు. ఆమె ఎక్కకపోవడంతో ఓ లేడీ పోలీసు దాడి చేసింది.
తన తల్లిని కొట్టొద్దని ఆమె కూతురు వేడుకుంటున్నప్పటికీ పోలీసులు ఆ యువతిని పక్కను లాగి పడేశారు. మాస్కు పెట్టుకోని మహిళను వాహనంలోకి ఎక్కాలంటూ నడిరోడ్డుపైనే కొట్టారు. ఆమె ఎంతకీ ఎక్కకపోవడంతో ఆమె జుట్టుపట్టుకుని, రోడ్డుపై పడేసి లేడీ పోలీసు కొట్టింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చూస్తోన్న నెటిజన్లు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాస్క్ పెట్టుకోవాలనే అవేర్ నెస్ తేవాలి.. ప్రజలను హెచ్చరించాలే తప్ప.. వారిని ఈ పరిస్ధితుల్లో ఇలా దండించడం ఏ విధంగానూ సమర్ధించలేని చర్య అంటూ అందరూ ఆగ్రహిస్తున్నారు.