PM Modi: తెలుగు ప్రజలకు వందే భారత్ పండుగ కానుక

PM Modi: వర్చువల్‌గా ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం

Update: 2023-01-15 06:37 GMT

PM Modi: తెలుగు ప్రజలకు వందే భారత్ పండుగ కానుక

PM Modi: తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్‌ రైలు ప్రారంభమైంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. పండుగ వాతావరణంలో తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ గొప్ప కానుక అని మోడీ అన్నారు. తెలుగు ప్రజలకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని.. ఈ రైలు ద్వారా రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి దోహదపడుతుందన్నారు. హైదరాబాద్ - వరంగల్ - విజయవాడ - విశాఖ నగరాలను అనుసంధానిస్తూ ప్రయాణం సాగుతుందన్నారు. అలాగే సికింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుందన్నారు. పూర్తిగా దేశీయంగా తయారైన వందేభారత్‌తో బహుళ ప్రయోజనాలున్నాయని ప్రధాని మోడీ చెప్పారు.

సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమైన వందేభారత్‌ రైలులో.. 16 బోగీలు ఉన్నాయి. అందులో 14 చైర్ కార్ బోగీలు, మరో రెండు ఎగ్జిక్యూటీవ్ చైర్‌కార్ బోగీలున్నాయి. మొత్తంగా రైలులో 11వందల 28 మంది ప్రయాణించవచ్చు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు సికింద్రాబాద్- విశాఖల మధ్య పరుగులు పెట్టనుంది. మెట్రో రైల్‌ తరహాలో స్లైండింగ్‌ తలుపులు, ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యమిచ్చారు. సీసీటీవీ కెమెరాలు, రీడింగ్‌ లైట్లు, అత్యవసర పరిస్థితుల్లో రైల్‌ సిబ్బందితో మాట్లాడేందుకు ప్రత్యేకంగా అలారం బటన్‌ ఏర్పాటు చేశారు.

ఇక విశాఖ నుంచి ప్రతిరోజూ ఉదయం 5.45కి వందే భారత్ రైలు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై.. రాత్రి పదకొండున్నరకి విశాఖపట్నానికి చేరుకుంటుంది. ఈ వందేభారత్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్- విజయవాడ మధ్య 350కిలోమీటర్ల దూరాన్ని 4గంటల్లో చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News