నూతన పార్లమెంట్‌కు ప్రధాని మోడీ భూమి పూజ

Update: 2020-12-10 09:03 GMT

మరో అద్భుతానికి నాంది పలికింది. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వహించారు. వేద పండితులు మంత్రాలు చ‌దివారు. భూమాత‌, కూర్మ‌, వ‌ర‌హారూప‌, న‌వ‌గ్రహ‌, న‌వ‌ర‌త్న భ‌రిత శిల పూజ‌లు నిర్వహించారు. న‌వ క‌ల‌శ స్థాప‌న త‌ర్వాత శంకుస్థాప‌న చేశారు. ప్రధాని మోడీ పేరిట పండితులు భూ పూజ‌ నిర్వహించారు. 971 కోట్ల ఖ‌ర్చుతో సెంట్రల్ విస్టా కొత్త పార్లమెంట్ కార్యాల‌యాన్ని నిర్మించ‌నున్నారు. 2022, ఆగ‌స్టు 15 నాటికి ఇది పూర్తి కానుంది. టాటా సంస్థకు నిర్మాణ ప‌నుల‌ను అప్పగించారు. ఇవాళ జ‌రిగిన భూమిపూజ‌, శంకుస్థాపన కార్యక్రమానికి ర‌త‌న్ టాటా హాజ‌ర‌య్యారు. లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాప‌న కార్యక్రమం సంద‌ర్భంగా బ‌హుళ మ‌త గురువుల‌తో ప్రార్థన‌లు నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పాత పార్లమెంట్ భ‌వ‌నంకు నిర్మాణ ప‌నుల‌ను 1921లో ప్రారంభించారు. ఆరేళ్ల త‌ర్వాత‌ 1927లో ఆ భ‌వ‌న నిర్మాణం పూర్తి అయ్యింది. అయితే సెంట్రల్ విస్టా భ‌వనాన్ని భార‌తీయ సంస్కృతి ప్రతిబింబిచేలా నిర్మించ‌నున్నారు.

ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్‌ త్వరలో సరికొత్త భవనంలో కొలువుదీరబోతోంది. కొత్త భవనంలో అణువణువునా భారతీయత ప్రతిబింబించనుంది. లోక్‌సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉండనున్నాయి. లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 20 మంత్రుల కార్యాలయాలు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 18, మొదటి అంతస్తులో 26, రెండో అంతస్తులో 28 కార్యాలయాలు ఉంటాయి. లోక్‌సభను ఆనుకొనే ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది. ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఉన్నట్లుగానే కొత్త భవనానికీ చుట్టూ నిలువెత్తు రాతిస్తంభాలు వస్తాయి.

ప్రస్తుతం తొలి రెండు వరుసల్లో కూర్చున్నవారికి తప్ప మిగతావారికి డెస్క్‌లు లేవు. కొత్త భవనంలో అందరికీ ఆ సౌకర్యం కల్పిస్తారు. అలాగే ప్రస్తుత భవనంలో అనలాగ్‌ మైక్‌లు ఉండగా, కొత్త దాంట్లో ప్రతి ఎంపీకీ ఒక టచ్‌ స్క్రీన్‌తో కూడిన డిజిటల్‌ సిస్టమ్‌ను ఏర్పాటుచేయనున్నారు. సభ్యులు వేసే ఓటు స్పష్టంగా కనిపించేందుకు వీలుగా నూతన భవనంలో 281 అంగుళాల వీడియో వాల్‌ను ఏర్పాటుచేస్తారు. గ్యాలరీల్లో కూర్చొనే ప్రజలకు సభా కార్యక్రమాలు కనిపించేలా 165 అంగుళాల తెరలను నెలకొల్పుతారు. వీవీఐపీల కోసం 2 గేట్లు, ఎంపీల వాహనాలు రావడానికి 2 గేట్లు, సాధారణ ప్రజలు, సిబ్బంది, మీడియా, సందర్శకుల కోసం 2 గేట్లు కేటాయిస్తారు. అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక లోక్‌సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజల కోసం 480 సీట్ల చొప్పున ఏర్పాటు చేయనున్నారు.

Tags:    

Similar News