Night Curfew: తమిళనాడు, బీహార్ లో రాత్రి కర్ఫ్యూ
Night Curfew: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు * కఠిన ఆంక్షలు విధిస్తున్న వివిధ రాష్ట్రాలు
Night Curfew: కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. తమిళనాడులో రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటలవరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 20 నుంచి ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్డౌన్ ఉంటుందని చెప్పింది. కర్ఫ్యూ సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రవాణాపై.. నిషేధం విధించింది. నీలగిరి, కొడైకనాల్ పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు తమిళనాడు సర్కారు స్పష్టం చేసింది. వేసవి క్రీడా శిబిరాలను నిషేధించింది. ఆదివారాల్లో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలు సాగించేందుకు అనుమతించింది. ఆదివారాల్లో ఈ కామర్స్ సంస్థలు కార్యకలాపాలను నిషేధించింది.
మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బిహార్ప్రభుత్వం కఠిన ఆంక్షలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపింది. మే15 వరకు పాఠశాలలు, కళాశాలు, కోచింగ్ సెంటర్లు మూసివేసే ఉంటాయని స్పష్టం చేసింది. మతపరమైన ప్రదేశాలన్నీ మే 15 వరకు మూసి ఉంటాయని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం 5 గంటలలోపే కొనసాగాలని, మూడో వంతు మంది అధికారులు మాత్రమే హాజరవ్వాలని చెప్పారు. అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు సాయంత్ర 6 గంటల్లోపు ముసివేయాలని తెలిపారు.