కరోనా కేసులు పెరుగుతున్న వేళ వైరస్ కట్టడికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. రాత్రి పూట కర్ఫ్యూపై నిబంధనలు విధించుకునే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించిన కేంద్రం నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. తగ్గినట్లే తగ్గి మన దగ్గర కూడా కేసులు పెరుగుతున్నాయ్. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. కరోనా వ్యాప్తికి కళ్లెం వేయడమే లక్ష్యంగా డిసెంబర్ 1నుంచి 31 వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాల్సిన నిబంధనలను ప్రకటించింది. కంటైన్‌మెంట్ జోన్ల బయట లాక్‌డౌన్‌కు తమ అనుమతి తప్పనిసరి అన్న కేంద్రం కంటైన్‌మెంట్ జోన్లలో అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా రాత్రిపూట కర్ఫ్యూ వంటి నిబంధనలు రాష్ట్రాలు విధించుకోవచ్చని హోంశాఖ తెలిపింది.
కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారికి జరిమానా విధించాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చిన కేంద్రం అంతర్జాతీయ ప్రయాణికులను హోంశాఖ నిబంధనల ప్రకారం అనుమతించాలని తెలిపింది. 50శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని క్రీడాకారుల శిక్షణ కోసం మాత్రమే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి ఉందని తెలిపింది. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు 50శాతం సామర్థ్యంతో హాలులోకి అనుమతించాలని ఇతర కార్యక్రమాలకు 2వందల మందికి మించరాదని తెలిపింది.
కేసులు మళ్లీ పెరుగుతుండడంతో రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయ్. మహారాష్ట్ర ఇప్పటికే కొత్త ట్రావెల పాలసీ ప్రకటించగా కరోనా కట్టడి కోసం పంజాబ్‌లో కర్ఫ్యూ విధించనున్నట్లు పంజాబ్ సీఎం తెలిపారు. డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుందని రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు. కోవిడ్ నిమయాలను అతిక్రమించే వారికి విధించే జరిమానాలను కూడా రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్ పాటించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు.