Cattle Found Dead in Karnataka: మొన్న కేరళ.. నిన్న ఏపీ.. నేడు కర్నాటక..
Cattle Found Dead in Karnataka: మూగ జీవాలను హింసించడం, వాటి ప్రాణాలను తీయడం నేరం అని తెలిసినప్పటికీ గత కొద్ది రోజులుగా మూగ జీవాలపై దాడులను చేస్తున్నారు.
Cattle Found Dead in Karnataka: మూగ జీవాలను హింసించడం, వాటి ప్రాణాలను తీయడం నేరం అని తెలిసినప్పటికీ గత కొద్ది రోజులుగా మూగ జీవాలపై దాడులను చేస్తున్నారు. ఇలాంటి అమానుషమైన ఘటనలు ఎక్కడో అక్కడ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆవులు, ఏనుగులు, కోతులు, శునకాల ఇలా అనేక రకాల జంతువులపై కొందరు తమ పైశాచికత్వం ప్రదర్శిస్తూ, మూగజీవాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే చిత్తూరు జిల్లాలో కొంత మంది వ్యక్తులు మేత కోసం వచ్చిన ఆవుకు నాటు బాంబుతో పండును పెట్టారు. ఆకలితో ఉన్న ఆ ఆవు దాన్ని కొరకడంతో బాంబు పేలి గాయాలపాయింది. ఈ సంఘటన జరగడానికి ముందు కేరళలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. నిండు గర్భిణి ఏనుగు నోట్లో పైనాపిల్‌తో కలిపి పేలుడు పదార్థులు తినిపించారు. దీంతో ఆ ఏనుగు కొద్ది రోజులు తిండి తినలేక చివరికి తుది శ్వాస విడిచింది.
ఈ రెండు సంఘటనలు మరవకముందే ఇంతకంటే దారుణమైన సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఆవులు మేతకోసం కాఫీ తోటలోకి చొరబడుతున్నాయనే కారణంతో కొంత మంది దుర్మార్గులు ఏకంగా 20 పశువులను అరటిపండ్లలో విషం పెట్టి చంపేసారు. ఈ హృదయవిదారకమైన సంఘటన కర్ణాటకలోని కొడగు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే కర్ణాటకలోని కొడగుఐగూరు ఎస్టేట్‌కు సమీపంలోని గ్రామం నుంచి పశువులు ప్రతి రోజూ మేతకోసం వెళ్లేవి. చాలా రోజుల నుంచి గమనిస్తు ఉండేవారు. ఇలా అయితే కుదరదని, తోటను పశువులు పూర్తిగా నాశనం చేస్తున్నాయని అరటిపండ్లలో విషం పెట్టి ఆవులకు తినిపించారు. ఆకలితో ఉన్న ఆ ఆవులు పాపం విషం అని తెలియక వారు పెట్టిన పండ్లను తిన్నాయి.
ఆ తరువాత అవి అక్కడే మరణించాయి. అయితే ఈ విషయం బయటికి తెలిస్తే ఎక్కడ గ్రామస్తులు గొడవ చేస్తారో అనుకున్న ఎస్టేట్ మేనేజర్ ఆవులను తోటలోనే గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. ఇలా ఇప్పటివరకు 20 పశువుల్ని బలిగొన్నారు. ప్రతి రోజు ఒక్కో ఆవు తగ్గుతుండడం, పెద్ద సంఖ్యలో పశువులు కనిపించకుండాపోవడంతో ఆవుల యజమానులు వాటిని వెతుక్కుంటూ బయలుదేరారు. అలా వెతుకుతూ ఆదివారం కాఫీ తోటవైపు వచ్చారు. అక్కడి గొయ్యిలో పశువుల కళేబరాలు కనిపించడంతో అనుమానం వచ్చింది. వెంటనే పశువుల యజమానులు ఎస్టేట్ స్టాఫ్ ను నిలదీసారు. దీంతో బెదురుకున్న ఎస్టేట్ స్టాఫ్జ రిగిన విషయం పూర్తిగా చెప్పేసారు. కాగా ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.