కశ్మీర్‌కు తొలి వందేభారత్ రైలు:ఈ ప్రత్యేకతలు తెలుసా?
వందేభారత్ రైలు సర్వీసులు జమ్మూ కశ్మీర్‌లో ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

కశ్మీర్‌కు తొలి వందేభారత్ రైలు:ఈ ప్రత్యేకతలు తెలుసా?
వందేభారత్ రైలు సర్వీసులు జమ్మూ కశ్మీర్‌లో ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభిస్తారు. జమ్మూలోని కాట్రా నుంచి వందే భారత్ రైలుకు మోదీ పచ్చజెండా ఊపనున్నారు.ఉదంపుర్-శ్రీనగర్-బారాముల్లా మధ్య 272 కి.మీ. రైలు లింక్ ప్రాజెక్టులో భాగంగా వందేభారత్ రైలును కేంద్రం ప్రవేశపెట్టనుంది.
కశ్మీర్‌ను రైల్వే సర్వీసులతో అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 1997లో ప్రారంభమైంది. 119 కి.మీ. ఈ రైల్వే లైన్ దూరం.ఈ ప్రాజెక్టులో 38 టన్నెల్ ఉంటాయి. ఇందులో టీ-49 పేరుతో నిర్మించిన సొరంగం అతి పొడవైంది. అంతేకాదు 927 బ్రిడ్జిలు నిర్మించారు. చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి 359 మీటర్ల ఎత్తు ఉంటుంది.
వందేభారత్ రైలులో ప్రత్యేకతలు
జమ్మూ-శ్రీనగర్ మధ్య నడిచే వందేభారత్ రైలు యాంటీ ఫ్రీజింగ్ సౌకర్యాలతో నిర్మించారు. ఈ మార్గంలో ఉదయం, రాత్రి రైళ్లు నడిచేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జమ్మూలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా రైలులో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రాజెక్టులో యాంటీ వైబ్రేషన్ సిస్మిక్ పరికరాలను ఉపయోగించారు.
సురక్షితమైన ప్రయాణంలో భాగంగా భూమిలోని ప్రకంపనలను డంపర్లు గ్రహిస్తాయి. దేశంలో నడుస్తున్న ఇతర వందేభారత్ రైళ్లతో పోలిస్తే కశ్మీర్ లో నడిచే వందేభారత్ రైలు భిన్నమైంది. తీవ్రమైన చలి అంటే మైనస్ 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో కూడా ఈ రైలు పనిచేసేలా రూపొందించారు. అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో పనిచేసేలా లోక్ పైలెట్లకు రైలులో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. లోక్ పైలట్ క్యాబిన్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విండ్ షీల్డ్ ఫాగింగ్ లేదా గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. అంతేకాదు అధిక ఉష్ణోగ్రతల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తుంది. టాయిలెట్లలో నీరు గడ్డకుండా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు.