TRF: ఈ ఉగ్రవాద గ్రూపును పాకిస్థాన్‌ ఎందుకు ఏర్పాటు చేసింది? దీని వెనుక ఉన్న కథ ఇదే!

TRF:TRF పేరుతో జరుగుతున్న ఈ కొత్త ఉగ్రవాద దాడులు, పాత శత్రుత్వాల ముసుగులో కొత్త ముద్రలు వేసే విధంగా సాగుతున్నాయి.

Update: 2025-04-25 02:30 GMT
TRF

TRF: ఈ ఉగ్రవాద గ్రూపును పాకిస్థాన్‌ ఎందుకు ఏర్పాటు చేసింది? దీని వెనుక ఉన్న కథ ఇదే!

  • whatsapp icon

TRF: 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' అనే పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. పహల్గాం ఘటన తర్వాత ఈ సంస్థపై దృష్టి మరింత గట్టిగానూ పడుతోంది. ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఈ గ్రూప్ ఉనికి ఎందుకు? అసలు వీళ్ల లక్ష్యం ఏంటి? ఎవరు వీళ్లకు మద్దతిస్తున్నారు?

ఆర్టికల్ 370 రద్దయ్యాక ఏర్పడిన ఈ గ్రూప్ మొదట ఆన్‌లైన్ వేదికగా ప్రోపగాండా కార్యక్రమాలతో మొదలైంది. కొన్ని నెలల వ్యవధిలోనే లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి పాత ఉగ్రవాద సంస్థల నుంచి కార్యకర్తల్ని తనలోకి లాక్కుని మిలిటెంట్ ఫోర్స్‌గా మారింది. పాక్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI ఈ గ్రూప్ వెనుకనుంది అనే ఆధారాలు నిఘా వర్గాల వద్ద స్పష్టంగా ఉన్నాయంటున్నారు. TRF సృష్టించడానికి అసలు ఉద్దేశం ఏమిటంటే, అంతర్జాతీయంగా లష్కరే తోయిబాపై ఉన్న నిషేధాలు, పాక్‌పై వచ్చిన FATF ఆంక్షల్ని తప్పించుకోవడమే. పేరు మార్చి పని కొనసాగించాలన్న కుట్ర ఇది. TRF పేరు వినిపించకుండా మిగతా మిలిటెంట్ సంస్థలు తమ దాడులకు దీన్ని షెల్ఫ్‌గా ఉపయోగిస్తున్నాయన్నదే నిపుణుల అభిప్రాయం.

ఈ గ్రూప్ కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేయడం లేదు. వివిధ మతాలపై దాడులు చేస్తూ, కశ్మీర్ ప్రాంతంలో భయోత్పత్తి, అస్థిరత సృష్టించడమే అసలు ఉద్దేశం. బీజేపీ కార్యకర్తలు, సైనికులు, కశ్మీరీ పండిట్లు, వలస కార్మికులు ఇలా వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకున్న TRF.. ప్రజల మధ్య భిన్నత్వాన్ని రెచ్చగొట్టాలన్న నాటకీయ ఎజెండాతో ముందుకు సాగుతోంది. ఈ గ్రూప్ వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందిన షేక్ సజ్జాద్, గతంలో లష్కరే తోయిబాలో కీలకపాత్ర పోషించాడు. శ్రీనగర్‌లో జర్నలిస్టు బుఖారీ హత్య కేసులో సజ్జాద్‌పై ఆరోపణలున్నాయి. ప్రస్తుతానికి అతడితో పాటు సలీం రెహ్మానీ అనే ఇంకొకరు TRF కార్యకలాపాల్లో కీలకంగా ఉన్నారు.

గతంలో జరిగిన TRF దాడుల్ని పరిశీలిస్తే.. రాజకీయ నాయకుల హత్యలు, సైనికులపై దాడులు, పర్యాటకులపై కాల్పులు.. ఇవన్నీ కేవలం ఉగ్రవాద చర్యలుగా కాకుండా, భారత్‌ను అంతర్గతంగా అస్థిరతకు గురిచేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఇటీవల బైసరన్‌లో జరిగిన పర్యాటకులపై కాల్పుల ఘటన దీన్ని మళ్లీ రుజువు చేస్తోంది.

ప్రస్తుతం TRF యాక్టివిటీపై భారత్‌తో పాటు పలు దేశాలు గట్టి నిఘా ఉంచుతున్నాయి. ఎందుకంటే ఈ గ్రూప్ కేవలం దాడులకు మాత్రమే పరిమితం కాకుండా, సోషల్ మీడియా వేదికగా యువతను మతపరమైన పరోక్ష సందేశాలతో దారి తప్పించే ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి చెప్పాలంటే.. TRF పేరుతో జరుగుతున్న ఈ కొత్త ఉగ్రవాద దాడులు, పాత శత్రుత్వాల ముసుగులో కొత్త ముద్రలు వేసే విధంగా సాగుతున్నాయి. వీటికి దీటుగా వ్యవహరించేందుకు ఇప్పుడు అంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News