Corona Second Wave: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Corona Second Wave: కరోనాపై, వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారాలు నమ్మకండి
Corona Second Wave: కచ్చితమైన సోర్సు నుంచే కరోనాపై వివరాలు తెలుసుకోవాలని, తప్పుడు ప్రచారాలు నమ్మకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నేడు రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో ఆయన మాట్లాడుతూ... రెండో దశలో కరోనా వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి దశ కరోనాను విజయవంతంగా ఎదుర్కోగలిగామని తెలిపారు. రెండో దశ కరోనా విజృంభణ నేపథ్యంలో తాము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆక్సిజన్, ఫార్మా కంపెనీల ప్రతినిధులతో చర్చించామని తెలిపారు.
వ్యాక్సిన్లపై కూడా వచ్చే వదంతులను నమ్మకూడదని అన్నారు. 45 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర సర్కారు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తుందని స్పష్టం చేశారు. అర్హులందరూ ఈ ఉచిత వ్యాక్సిన్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
సామాజిక మాధ్యమాల ద్వారా కరోనాపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్రాలకు సహకరిస్తామని చెప్పారు. రాష్ట్రాల ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర సర్కారు సహకరిస్తోందని తెలిపారు.