Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు

Manish Sisodia: రూ. 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు

Update: 2024-08-09 15:45 GMT

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు 

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్‌ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది.

లిక్కర్ స్కాం కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అరెస్టయిన రెండు రోజుల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. 17 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్‌ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ బి.ఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె.వి. విశ్వనాథన్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

సిసోడియాకు బెయిల్ మంజూరవడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు హర్షం వ్యక్తంచేశారు. ఈ రోజు నిజం గెలిచిందని.. ఈ తీర్పు నియంతృత్వానికి చెంపదెబ్బ వంటిదన్నారు. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, సత్యేందర్‌ జైన్‌కు కూడా త్వరలోనే న్యాయం జరిగి జైలు నుంచి విడుదలవుతారని ఆశిస్తున్నామని ఎంపీ సంజయ్‌సింగ్‌ ధీమా వ్యక్తంచేశారు.

Tags:    

Similar News