Gas Price Reduced: కేంద్రం రాఖీ కానుక.. గ్యాస్​ సిలిండర్​ ధర రూ.200 తగ్గింపు

Gas Price Reduced: రాఖీ పౌర్ణమి, ఓనం పండుగల సందర్భంగా తగ్గింపు

Update: 2023-08-29 11:48 GMT

Gas Price Reduced: కేంద్రం రాఖీ కానుక.. గ్యాస్​ సిలిండర్​ ధర రూ.200 తగ్గింపు

Gas Price Reduced: వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. గృహోపయోగ ఎల్‌ పీ జీ సిలిండర్‌పై 200 రూపాయల చొప్పున తగ్గించింది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. రక్షాబంధన్‌, ఓనం పండుగల సందర్భంగా ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉజ్వల పథకం కింద 75 లక్షల కొత్త వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు మంత్రి.

ఇంట్లో వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఒక వేయి 103 రూపాయలు ఉంది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్‌ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరలను మాత్రం స్థిరంగా ఉంచుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై 50 రూపాయల చొప్పున పెంచారు. 2016లో పీఎం ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం కింద 5 కోట్ల వంట గ్యాస్‌ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చారని తెలిపారాయన.

Tags:    

Similar News