గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్-14 (పీపీ-14), పాంగాంగ్ టీఎస్‌వో వద్ద భారత్ - చైనా సైనికులు వచ్చి చేరుతునట్లు తెలుస్తోంది. దీంతో భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. వాతావరణం గంభీరంగా ఉంది. కీలక ప్రాంతాల్లో భారత్-చైనాలు సైనికులు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక రెండు వైపులా బలగాలు పెద్ద ఎత్తున చేరాయి. ఇరు వైపుల వెయ్యిమందిపైగా బలగాలు మోహరించినట్లు తెలుస్తోంది. కాగా.. లద్దాఖ్‌లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఫింగర్ 4 ప్రాంతం వద్ద పరిస్థితి భారత్ అదుపులోనే ఉంది.
చైనా నుంచి ఎటువంటి ప్రతిఘటన జరిగినా అడ్డుకునేందుకు భారత్ తనకున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. పాంగాంగ్ టీఎస్‌వో నుంచి చైనా బలగాలు వెనుదిరిగి వెళ్లిపోయేలా భారత్ స్పెషల్ ఆపరేషన్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. జూన్ 15 తర్వాత ఇప్పటివరకూ ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోలేదు. అయితే, ఇటు ఇండియా అటు చైనా దేశాల నుంచి గల్వాన్, అటు పాంగాంగ్‌లలో భారీగా బలగాలు మోహరిస్తున్నాయి. మరోవైపు చైనా దాడులు చేస్తే తిప్పికొట్టేందుకు భారత్ శిబిరంలోనూ సైనికులను రంగంలోకి దించుతోంది. గాల్వన్ సరిహద్దులో చైనా సైనికులు జరిపిన దాడిలో 20 మంది భారత సైనికుల అమరులైన సంగతి తెలిసిందే. చైనా సైనికుల దాడిపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది.
గత కొన్ని రోజులుగా ఇదే ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత నెల 5 నుంచి రెండు దేశాల సైనికుల మధ్య తోపులాటలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో చైనా పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. అందుకు తగ్గట్లుగానే మనదేశం కూడా భారీగా ఆర్మీని రంగంలోకి దిగింది. అంతలోనే ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాలు వెనక్కి తగ్గాలని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చాయి. కానీ సోమవారం నాటి ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. 1975 తర్వాత ఇండో చైనా బోర్డర్‌లో జరిగిన ఘర్షణల్లో ప్రాణనష్టం జరగడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.