Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
Arvind Kejriwal: కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వి
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు ఇంకా ఊరట లభించలేదు. సీబీఐ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సెప్టెంబరు 10న తీర్పు వెలువరించినున్నట్టు వెల్లడించింది. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు.. బెయిల్ కోసం అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ.. సీబీఐ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం విధానంపై కేసు నమోదు చేసిన తర్వాత రెండేళ్ల వరకు సీఎంను అరెస్టు చేయలేదని... ఎప్పుడైతే ఈడీ కేసులో బెయిల్ వచ్చిందో.. వెంటనే సీబీఐ ఇన్స్యూరెన్స్ అరెస్టుకు పాల్పడిందన్నారు.
అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు కూడా పంపించలేదని సింఘ్వీ కోర్టుకు వివరించారు. ఈ వాదనల అనంతరం సీబీఐ తీరుపై ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, ఆ నిబంధన ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. మరోవైపు, కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను సీబీఐ వ్యతిరేకించింది. ఈ కేసులో బెయిల్ కోసం ఆయన సెషన్స్ కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు వెళ్లారని సుప్రీం దృష్టికి తీసుకొచ్చింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.