వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తోన్న భారత్, 90 కోట్లు దాటిన డోస్‌ల సంఖ్య...
Covid Vaccination Records - India: దేశంలో 47.3 శాతం తొలిడోస్, 17.4 శాతం సెకండ్ డోస్ అందజేత
Covid Vaccination Records - India: ప్రపంచ దేశాలపై కరోనా దాడి కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి 50 లక్షల మందిని బలితీసుకోగా.. భారీ సంఖ్యలో బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా ఊపందుకుంది. వ్యాక్సినేషన్‌లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు దేశంలో 47.3 శాతం మందికి తొలిడోస్, 17.4 శాతం మందికి సెకండ్ డోస్ అందించారు. కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌ల సంఖ్య 90 కోట్ల మైలురాయిని దాటింది.
దేశం నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో భాగంగా.. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సిన్ అందించారు. మార్చి 1 నుంచి సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించింది కేంద్రం. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత డ్రైవ్ వేగం పుంజుకుంది. గత 259 రోజుల్లో 90 కోట్లకు పైగా డోస్‌లను అందించారు. ఇక.. సెప్టెంబర్ 17 ప్రధాని మోడీ పుట్టినరోజును పురస్కరించుకొని అదేరోజు అత్యధికంగా రెండున్నర కోట్ల డోసులను ప్రజలకు అదించారు.