కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ సరే... మరి తెలుగు సినిమా రంగంపై ఏర్పాటైన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడ?
తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు 2019లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
మళయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ అంశాలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. తెలుగు నటి సమంత హేమ కమిటీ రిపోర్టును సమర్థిస్తూ.. తెలుగు సినీ పరిశ్రమలో మహిళల పరిస్థితిపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదికను కూడా బయట పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నటి అనుష్కశెట్టి, ఝాన్సీ, సుమ, దర్శకురాలు నందినీ రెడ్డి వంటి వారు ఈ డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు.
హేమ రిపోర్టులో ఏముంది?
మలయాళ సినీ నటిని 2017లో కొందరు కిడ్నాప్ చేశారు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 10 మందిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో ప్రముఖ నటుడు దిలీప్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు 2020 నుంచి విచారణలో ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. సినీ పరిశ్రమలో కొనసాగుతున్న వివక్షపై ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సభ్యులు ముఖ్యమంత్రికి పినరయి విజయన్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యలపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.
దాంతో, కేరళ ప్రభుత్వం 2017 జులైలో జస్టిస్ హేమ కమిటీని నియమించింది. ఈ కమిటీ అక్కడి సినీ పరిశ్రమ వ్యవహారాలపై పరిశోధన చేసి రెండేళ్ళ తరువాత 300 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే, ప్రభుత్వం ఆ రిపోర్టును దాదాపు అయిదేళ్ళ పాటు అటకెక్కించింది. మొన్న ఆగస్ట్ 19న ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నివేదికను బహిరంగం చేసింది.
“తారాలోకంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అందమైన చంద్రుడు, మెరిసే తారలు ఉన్నాయి. కానీ, శాస్త్రీయంగా చూస్తే తారలకు తళుకు ఉండదు, చంద్రుడు అందంగా ఉండడు” అనే వాక్యంతో మొదలైన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన వారి లిస్టులో పెద్ద స్టార్ల పేర్లూ ఉన్నాయి.
ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన తరువాత పరిశ్రమలోని నటీమణులు, ఇతర మహిళలు కొందరు నటులు, దర్శకులు తమను ఏ రకంగా లైంగికంగా వేధించారో ధైర్యంగా చెప్పారు. ఈ పరిణామాలు మాలీవుడ్‌లో పెద్దఎత్తున దుమారం రేపాయి. హేమ కమిటీ రిపోర్ట్ దెబ్బకు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ పదవికి రాజీనామా చేశారు. మలయాళ సినీ పరిశ్రమపై వస్తున్న ప్రచారం నష్టం చేస్తాయని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమ బతకాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇండస్ట్రీలో పవర్ సెంటర్ అనేది లేదు.. కానీ సినిమా బతకాలనేది తన అభిప్రాయమని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చెప్పారు.
తెలుగు సినిమా పరిశ్రమపైనా హేమ తరహా కమిటీ
తెలుగు సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు 2019లో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. టాలీవుడ్ లో మహిళలపై లైంగిక వేధింపులు, సినిమాలో అవకాశం దక్కాలంటే కమిట్ మెంట్ అడుగుతారని ఆరోపణలు రావడమే ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైంది. నటి శ్రీరెడ్డి 2018 ఏప్రిల్ 7న ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేయడం అప్పట్లో సెన్సేషన్ అయింది. ఈ విషయమై జాతీయ మానవహక్కుల కమిషన్ తెలంగాణ సమాచార ప్రసారశాఖకు నోటీసులు జారీ చేసింది.
టాలీవుడ్ లో వేధింపులపై తెలంగాణ నియమించిన ఈ ఉన్నత స్థాయి కమిటీకి స్టేట్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావును ఛైర్మన్ గా నియమించారు. తెలుగు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కమిటీ 2019 నుంచి 2022 వరకు అధ్యయనం చేసింది. 10 నుంచి 15 వరకు వర్క్ షాప్ లు నిర్వహించింది.
కమిటీ సభ్యులు ఇండస్ట్రీలోని 15 విభాగాలకు చెందిన వారితో మాట్లాడారు. పనివేళలు, మహిళా ఉద్యోగుల పని పరిస్థితులు, వేతనాలు, వేధింపులు తదితర అంశాలపై అధ్యయనం చేశారు. రెండేళ్ళ అధ్యయనం తరువాత ఈ కమిటీ, ‘సెక్సువల్ హరాస్మెంట్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీస్’ అనే పేరుతో 2022 జూన్ 1న ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించింది.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్... POSH ACT-2013 ను అమలు చేయడం లేదని ఈ కమిటీ గుర్తించింది. సినీ రంగంలో అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తారని, నైట్ షిప్టులో పనిచేసేవారికి రవాణ సౌకర్యం లేదనే అనేక విషయాలు ఈ నివేదికలో ఉన్నాయని కమిటీ సభ్యులు తెలిపినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఈ కమిటీ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదు?
2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఈ నివేదికను బయటపెట్టలేదు. ఈ నివేదిక ఆధారంగా ఎవరిపై కూడా చర్యలు తీసుకోలేదు. నివేదిక అస్పష్టంగా ఉందని, చర్యలు తీసుకోవడానికి ఏమీ లేదని అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాకు చెప్పారు. అంతేకాదు, ఆ నివేదికలో ఎలాంటి స్పష్టమైన సిఫారసులు కూడా చేయలేదని ఆయన చెప్పినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి అంది ఇప్పటికే రెండేళ్ళు దాటింది. హేమ కమిటీ రిపోర్టు రేపుతున్న కలకలం నేపథ్యంలో సినీ పరిశ్రమలో మార్పులు రావాలనే డిమాండ్స్ బలంగా వినిపిస్తున్నాయి. అందుకే, తెలుగు సినీ పరిశ్రమపై సమర్పించిన కమిటీ నివేదికను బయటపెట్టడానికి ఇదే తగిన సమయం అని ఇండస్ట్రీలోని మహిళా ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ అయినా ఈ రిపోర్టును బహిరంగం చేసి, కమిటీ సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని దర్శకురాలు నందిని రెడ్డి, నటులు ఝాన్సీ, సుమ కనకాల, సింగర్లు చిన్మయి శ్రీపాద, కౌసల్య తదితరులు కోరుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వారి డిమాండ్‌ను ఆమోదిస్తారా? ఆమోదించి నివేదికను బహిరంగం చేస్తే ఏమవుతుంది? తెలుగు సినిమాలో ఎలాంటి కల్చర్ రాజ్యమేలుతుందో తెలిసిపోతుంది. దానికి ఎలాంటి చికిత్స అవసరమో నిర్ణయించాల్సి ఉంటుంది.