ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది

Odisha: కళ్లేపల్లి వద్ద సముద్రంలో కలుస్తున్న నాగావళి

Update: 2022-08-20 02:54 GMT

ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది

Odisha: ఒడిశాలో వర్షాలు కురుస్తుంటే సిక్కోలు జిల్లా నాగావళి నది పరివాహక ప్రాంతవాసుల్లో అలజడి నెలకొంటుంది. భారీ వర్షాలకు వచ్చే వరదలు.. తమ గ్రామాలను ముంచెత్తుతాయనే భయం కనిపిస్తోంది. కళ్ల ముందే పక్కా నిర్మాణాలు కూలిపోతున్నా..పరిష్కారం చూపాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధుల జాడ కనబడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఏటా వరద ముంపుతో బాధితులు పడుతున్న సమస్యలపై hmtv స్పెషల్ స్టోరీ.

సిక్కొలు జిల్లాకు జీవనది నాగావళి. ప్రతి ఏటా నదికి వచ్చే వరదలతో పరివాహక ప్రాంత వాసులు, అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏటా నది కూడా తన దిశ మార్చుకుంటూ ఒడ్డు కోతకు గురై, అందరి గుండె కోతకు కారణమైంది. దీంతో గ్రామస్తులకు, అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు.

గతంలో నాగావళి నది వరదకు పంటలు పోయేవని నేడు పక్కా నిర్మాణాలు దెబ్బతింటున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఎన్నికల హామీగానే కరకట్టల నిర్మాణం ఉండిపొతుందంటున్నారు. పనులు నత్త నడకన సాగుతున్నాయని..నాగావళి నదికి మాత్రం వరద భారీగా వస్తుందని.. బాధితులు వాపోతున్నారు.

నాగావళి నది ఒడిశా రాష్ట్రంలో పుట్టి ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, మణ్యం, శ్రీకాకుళం‌ జిల్లాలలో ప్రవహిస్తుంది.‌ ఎపీలోని కూనేరు గ్రామంలో అడుగుపెట్టిన నాగావళి నది.. కళ్లేపల్లి వద్ద సముద్రంలో కలిసేంత వరకూ 160 కిలోమీటర్లు ప్రహాహిస్తోంది. 2006 సంవత్సరంలో నాగావళి ఉగ్రరూపం దాల్చి.. 1లక్ష 70వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించింది. నది తీరమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వం నాగావళి నది ఇరువైపులా అవసరమైన చోట వరద కట్టలు నిర్మించతలపెట్టింది. 18వేల ఎకరాల పంట పొలాలు, 28 గ్రామాలు నాగావళి నీటి ముంపు నుంచి రక్షించేందుకు ఈ కరకట్ట పనులు తలపెట్టారు. ఏండ్లు గడవటంతో నాగావళి కరకట్టలు నేడు బలహీనంగా మారాయి. చాలా చోట్ల గండ్లు పడటం, తాత్కాలికంగా పూడ్చడం వంటి పనులు జరుగుతూ వస్తున్నాయి.

వరదలకు ప్రతి ఏటా బూర్జ మండలం అతలాకుతలం అవుతోంది. పాలకొండ మండలం అంపిలి నుండి బూర్జ మండలంలో కాఖండ్యాం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల పొడవునా గతంలో కరకట్టల నిర్మాణాన్ని చేపట్టారు. వీటి పర్యవేక్షణ కొరవడంతో వరుసగా వచ్చిన నీలం, పైలాన్, హుద్‌హుద్, తిత్లీ లాంటి తుఫాన్‌ల ప్రభావంతో నాగావళి తీరం కోతకు గురయ్యింది. గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన అకాల వర్షాలకు వచ్చిన వరదలతో శ్రీకాకుళం పట్టణంలో, 500 మీటర్ల వరకూ తీరం కొతకు గురైంది. ఆమదాలవలస మండలం కలివరంలో పక్క భవనాలు నదీ గర్బంలో కలిసిపొయాయి.

నాగావళి నదిలో కరకట్టలు దెబ్బతినకుండా 8 చోట్ల రాతితో గ్రోయిన్లు నిర్మించడానికి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రతి సారీ తాత్కాలిక చర్యలు చేపట్టడం...అవి వరదల్లో కోట్టుకు పోవడం పరిపాటిగా మారింది. వరదలు వస్తే ఆముదాలవలస మండలంతో పాటు మండలంలో వేలాది ఎకరాలు పంట మునిగే పరిస్థితి నెలకొంది.

Tags:    

Similar News