Farmers Protests: 13న రైతుల చలో పార్లమెంట్.. కట్టడికి హర్యానా సర్కార్ ఆంక్షలు..
Farmers Protests: బారికేడ్లు, భారీ సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేసిన బలగాలు
Farmers Protests: కనీస మద్దతు ధరకి హామీ ఇచ్చేలా చట్టం తీసుకురావడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు చలో ఢిల్లీ మార్చ్‌కి పిలుపునిచ్చారు. 2వందలకు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఈ మార్చ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హర్యానా పోలీసులు అలర్ట్ అయ్యారు.
రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్ అడ్డుకునేందుకు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అంబాలా, జింద్, ఫతేహాబాద్ జిల్లాల్లో పంజాబ్-హర్యానా మధ్య బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్తానిక పోలీసులతో పాటు పారా మిలిటరీ బలగాలను కూడా ప్రభుత్వం రంగంలోకి దింపింది.
ఇక రైతుల ఆందోళనల నేపథ్యంలో సరిహద్దుల్లోని 7 జిల్లాలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. అంబాలా, కురుక్షేత్ర, కైతాన్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాలో ఇంటర్నెట్, బల్క్ SMS, డాంగిల్ సేవల్ని నిలిపేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 11న ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 13 రాత్రి 12 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని వెల్లడించింది.
రైతులు ఆందోళనలకు పిలుపునివ్వడంతో కేంద్ర మంత్రులు వారికి నచ్చజెప్పేందుకు రంగంలోకి దిగారు. పీయూష్ గోయల్‌తో పాటు ముగ్గురు మంత్రులు రైతు సంఘాల నేతలతో చర్చించారు. ప్రభుత్వంతో చర్చలు పూర్తికాకపోగా.. మరో విడత సమావేశం జరగనుంది. అయితే రెండో విడత సమావేశం జరిపినా ప్రస్తుత ఢిల్లీ మార్చ్ మాత్రం చేసి తీరుతామంటున్నారు రైతు సంఘాల నేతలు.