TOP 6 News @ 6 PM: సమంత తండ్రి జోసెఫ్ కన్నుమూత..మరో 5 ముఖ్యాంశాలు

నటి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం మరణించారు. తండ్రి మరణించడంతో ఆమె విచారంలో మునిగిపోయారు

Update: 2024-11-29 13:22 GMT

సమంత తండ్రి జోసెఫ్ కన్నుమూత:మరో 5 ముఖ్యాంశాలు

1.సమంత తండ్రి జోసెఫ్ కన్నుమూత

నటి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం మరణించారు. తండ్రి మరణించడంతో ఆమె విచారంలో మునిగిపోయారు. హృదయం ముక్కలైన ఎమోజీని ఆమె తన ఇన్ స్టా లో పోస్టు చేశారు. జోసెఫ్ ప్రభు ఆంగ్లో ఇండియన్. ఆయన చెన్నైలో సెటిలయ్యారు. సమంత తల్లి నైనిట్ట సిరియన్ మళయాళీ. జోసెఫ్, నైనిట్టది ప్రేమ వివాహం. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు. ఒక అమ్మాయి. సమంతకు ఇద్దరు అన్నయ్యలు. సమంత సోదరుడు పెళ్లి ఇటీవలనే అమెరికాలో జరిగింది.నాగ చైతన్యతో సమంత విడిపోయిన తర్వాత జోసెఫ్ ప్రభు వీరిద్దరి పెళ్లి ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. చాలా కాలం క్రితం వరకు ఓ కథ ఉండేది. అది ఇప్పుడు లేదు.. కొత్త కథను ప్రారంభిద్దాం అని ఈ ఫోటోలతో పాటు ఆయన కామెంట్స్ పెట్టారు.

2.లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ

లగచర్లలో 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉపసంహరించుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 580 మంది రైతుల నుంచి 632 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 580 మంది రైతుల్లో మెజారిటీ గిరిజనులు. ఇందులోనూ ఎకరం, అర ఎకరం ఉన్న రైతులే ఎక్కువ. ఫార్మా క్లస్టర్ కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేందుకు స్థానికులు నిరాకరిస్తున్నారు.ఈ నెల 11న లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులపై స్థానికులు దాడికి ప్రయత్నించారు. అధికారులను పోలీసులు రక్షించారు. కడా అధికారి వెంకట్ రెడ్డిని స్థానికులు చితకబాదారు.

3.రిషితేశ్వరి సూసైడ్ కేసు కొట్టివేసిన కోర్టు

రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకోయిందని కోర్టు అభిప్రాయపడింది. 2015 జులై 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ ను అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలోని వరంగల్ కు చెందిన రిషితేశ్వరి నాగార్జున యూనివర్శిటీలో అర్కిటెక్చర్ చదువుతున్నారు.

4.బూడిద వివాదం పరిష్కారిస్తామని సీఎం హామీ

జమ్మలమడుగులోని ఆర్టీపీపీ నుంచి బూడిద తరలింపు విషయమై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన వివాదం శుక్రవారం సీఎంఓకు చేరింది. చంద్రబాబు పిలుపు మేరకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇవాళ చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో ఆయన ఈ సమావేశానికి రాలేదు. పీఎంఈజీపీలో భాగంగా స్థానికులకు ఉపాధి కల్పించేందుకు బూడిదను తీసుకెళ్తున్నామని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఈ విషయమై పోలీసులకు లేఖలు రాసిన జేసీ ప్రభాకర్ రెడ్డి సీఎం మీటింగ్ కు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.

5. రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ సోదాలు

అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారాల కేసులో రాజ్ కుంద్రాతో పాటు ఆ కేసుతో సంబంధం ఉన్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఆశ్లీల చిత్రాలు నిర్మించి పలు ఆప్ ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారని 2021 లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఈడీ అధికారులు ముంబై, ఉత్తర్ ప్రదేశ్ లలోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

6. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ హబ్..పవన్ కళ్యాణ్

కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్ గా మార్చారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 640 పీడీఎస్ టన్నుల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ శుక్రవారం పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలను ఆపుతానని గతంలో ఇచ్చిన హమీని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాలపై స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారన్నారు. తమ పాలనలో ప్రతీకార చర్యలు ఉండవన్నారు. అలాగనీ తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన చెప్పారు.

Tags:    

Similar News