H-1B visa: ఎనిమిదేళ్లలో 56 శాతం తగ్గించిన భారత ఐటీ కంపెనీలు
H-1B visa: అమెరికాలో ఉన్న ఏడు భారతీయ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్-1 బీ వీసా ధరఖాస్తులను తగ్గించాయి.
H-1B visa: అమెరికాలో ఉన్న ఏడు భారతీయ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు హెచ్-1 బీ వీసా ధరఖాస్తులను తగ్గించాయి. ఎనిమిదేళ్లలో ఈ వీసాల ధరఖాస్తుల సంఖ్య 56 శాతానికి పడిపోయిందని నివేదికలు సూచిస్తున్నాయి. స్థానికంగా ఉన్న ఉద్యోగులను తీసుకుంటున్నాయి ఐటీ కంపెనీలు.భారతీయ ఐటీ సంస్థలు హెచ్-1 బీ వీసా ధరఖాస్తులను తగ్గిస్తే అమెరికాకు చెందిన అమెజాన్, గూగుల్ వంటి సంస్థలు మాత్రం తమ ఉద్యోగులకు ఈ వీసా ధరఖాస్తులను పెంచాయి.
హెచ్-1 బీ వీసా అంటే ఏంటి?
అమెరికాలో తాత్కాలికంగా విదేశీయులు ఉద్యోగం చేయడానికి హెచ్-1 బీ వీసా జారీ చేస్తారు. అయితే ప్రత్యేక నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే వీటిని జారీ చేస్తారు.అమెరికాలో మానవ వనరుల కొరత నేపథ్యంలో 1990 దశకంలో ఈ వీసాను అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
సాధారణంగా ప్రతి ఏటా 65 వేల వీసాలను జనరల్ కోటా కింద జారీ చేస్తారు.ఎక్కువ ధరఖాస్తులు వస్తే లాటరీ తీస్తారు. అమెరికాలో ఉన్న భారతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం హెచ్-1 బీ వీసా కోసం ధరఖాస్తు చేస్తుంటాయి. ఈ వీసాకు లక్ష నుండి రూ. 5 లక్షల రూపాయాల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ట్రంప్ కఠిన వైఖరి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో వీసాల జారీలో కఠిన విధానాలు అవలంభించారు. ఈ సమయంలో భారతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలు హెచ్-1 బీ వీసాల ధరఖాస్తులో జాగ్రత్తలు పాటించాయి. అయినా కూడ ఈ వీసా ధరఖాస్తులు తిరస్కరించిన సందర్భాలు లేకపోలేదు. దరిమిలా స్థానికంగా నైపుణ్యం ఉన్న ఉద్యోగులను నియమించుకోవడానికి భారతీయ ఐటీ సంస్థలు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాయి.ఈ కారణాలతో ఈ వీసాల ధరఖాస్తుల సంఖ్య తగ్గిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
6 వేలకు తగ్గిన వీసా ధరఖాస్తులు
భారత్ కు చెందిన పలు ఐటీ సంస్థలు అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.అయితే ఇందులో ప్రధానంగా ఏడు ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల కోసం హెచ్-1 బీ వీసాల కోసం ధరఖాస్తులు చేసేవి. 2015 ఆర్ధిక సంవత్సరంలో ఈ ఏడు కంపెనీలు 15,166 మందికి వీసాల కోసం ధరఖాస్తు చేశాయి. అయితే 2023 ఆర్ధిక సంవత్సరానికి ఈ ఏడు కంపెనీలు కేవలం 6,732 మందికి వీసాల కోసం ధరఖాస్తు చేసుకున్నాయని నేషనల్ పౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఏపీ) సంస్థ నివేదిక తెలిపింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2015లో అత్యధికంగా హెచ్-1 బీ వీసాలను దక్కించుకొంది. అయితే ఈ ఎనిమిదేళ్లలో ఆ సంస్థ వీసా ధరఖాస్తులు 75 శాతం పడిపోయాయి.ఇక ఇన్ఫోసిస్ 21 శాతం, విప్రో 69 శాతం, హెచ్ సీ ఎల్ 46 శాతం తగ్గినట్టుగా ఈ నివేదిక సూచిస్తుంది.టెక్ మహీంద్రా, హెక్సావేర్ టెక్నాలజీస్ సంస్థలు కూడ తక్కువగానే వీసాల కోసం ధరఖాస్తు చేసినట్టుగా గణాంకాలు తెలుపుతున్నాయి.
టెక్నాలజీ వినియోగం
అమెరికాలోని నైపుణ్యం ఉన్న ఉద్యోగుల సేవలను వినియోగించుకోవడంపై భారతీయ ఐటీ కంపెనీలు ఫోకస్ పెట్టాయి. మరో వైపు క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వంటి సేవలను ఉపయోగించుకోవడం ద్వారా ఉద్యోగుల అవసరం తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారతీయ ఐటీ కంపెనీలు భవిష్యత్తులో హెచ్-1 బీ వీసాల కోసం ధరఖాస్తుల సంఖ్యను పెంచకపోవచ్చనే అభిప్రాయాలు లేకపోలేదు.
వీసా ధరఖాస్తు ఫీజు పెంపు
అమెరికా ప్రభుత్వం ఇటీవల కాలంలో వర్క్ వీసా నిబంధనలను కఠినతరం చేసింది.వీసా ధరఖాస్తు ఫీజు కూడ పెంచింది అమెరికా ప్రభుత్వం. హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ఫీజును 10 డాలర్ల నుండి 215 డాలర్లకు పెంచారు. ధరఖాస్తు ఫీజును 460 డాలర్ల నుండి 780 డాలర్లకు పెంచడం కూడ ఐటీ కంపెనీలకు భారంగా మారింది. హెచ్-1 బీ వీసాల కోసం ధరఖాస్తు చేయడం కంటే స్థానికంగా ఉన్న నిపుణులను నియమించుకొంటున్నాయి.
గూగుల్, అమెజాన్ సంస్థల్లో పెరిగిన హెచ్-1 బీ వీసాలు
అమెరికాలో పేరొందిన అమెజాన్, గూగుల్ వంటి సంస్థలు తమ సంస్థ ఉద్యోగుల కోసం హెచ్-1 బీ వీసా ధరఖాస్తులను పెంచాయి. 2015లో అమెజాన్ కంపెనీ హెచ్-1 బీ వీసా ధరఖాస్తుల్లో పదో స్థానంలో ఉంది.అయితే 2023 నాటికి హెచ్-1 బీ వీసా ధరఖాస్తుల్లో ఆ సంస్థ టాప్- 1 స్థానంలో నిలిచింది.అమెజాన్ సంస్థ తమ ఉద్యోగుల కోసం 279 శాతం వీసాలను పెంచింది. 2015లో 1070 ధరఖాస్తులు చేస్తే, 2023 నాటికి 4052 ధరఖాస్తులకు పెంచింది అమెజాన్ సంస్థ.ఇక గూగుల్ కు 2015లో టాప్ టెన్ లో స్థానమే లేదు. కానీ, 2023 నాటికి ఆ సంస్థ నాలుగో స్థానంలో నిలిచింది.
నైపుణ్యాల పెంపుపై ఫోకస్
అమెరికాలోని విద్యాసంస్థల్లో నైపుణ్యాలపై భారతీయ ఐటీ కంపెనీలు ఫోకస్ పెట్టాయి. ట్రంప్ అధ్యక్ష పదవి నుండి వైదొలిగిన తర్వాత జోబైడెన్ సర్కార్ వీసా నిబంధనలను సులభతరం చేసింది. అయితే అప్పటికే స్థానిక ఉద్యోగుల్లో స్కిల్స్ పెంపుపై భారతీయ ఐటీ సంస్థలు కేంద్రీకరించాయి. అదే సమయంలో ఆయా విద్యాసంస్థల్లో స్టెమ్( సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం)అనే కార్యక్రమాన్ని నాస్కామ్ ప్రారంభించింది.ఇందు కోసం 1.1 బిలియన్లను ఖర్చు చేస్తున్నారు. 130 కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో స్టెమ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 2,55,000 ఉద్యోగుల్లో స్కిల్స్ పెంచారు. 6 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేందుకు ఐటీ ఇండస్ట్రీ దోహదపడింది
హెచ్-1 బీ వీసాల్లో 70 శాతం ఇండియన్లే
హెచ్-1 బీ వీసాల్లో 70 శాతం ఇండియన్లు పొందుతున్నారు. భారతదేశానికి చెందిన ఏడు ప్రముఖ ఐటీ కంపెనీలు 56 శాతం ఈ వీసాలను తగ్గించినా కూడా ఇండియన్లే ఈ వీసాలు ఎక్కువగా పొందుతున్నారు.