కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఓ వైపు రైతులు ఆందోళనలు మరోవైపు సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో కొత్త చట్టాల అమలులో కేంద్రానికి ఇబ్బందులు ఎదరవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక ఉద్యమకారుడు అన్నాహజరే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రైతుల సమస్యలపై ఈ నెలాఖరులో నిరాహార దీక్ష చేయబోతున్నట్లు అందులో పేర్కొన్నారు. చట్టాల రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేయాలని అన్నాహజరే అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు ప్రజాస్వామ్య విలువలకు లోబడి లేవని విమర్శించారు. ఐతే దీక్ష ఏ రోజున చేస్తారన్న దానిపై స్పష్టమైన తేదీ ప్రకటించలేదు అన్నాహజారే.
డిసెంబరు 14న కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు కూడా అన్నా హజారే లేఖ రాశారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ప్రతిపాదనలను అమలు చేయాలని అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వాలని అందులో డిమాండ్ చేశారు. లేదంటే తాను నిరహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై ఇప్పటికీ ఐదు సార్లు కేంద్రానికి లేఖ రాశానని కానీ ఎలాంటి స్పందన లేదని అన్నా హాజరే పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. తన జీవితంలో చివరి నిరహార దీక్షను రైతుల కోసం చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.