2021-22 కేంద్ర బడ్జెట్: మధ్య తరగతి వర్గం పద్దులో ఏం కోరుకుంటోంది?
*2021-22 కేంద్ర బడ్జెట్‌పై భారీ అంచనాలు *బడ్జెట్‌లో ఎలాంటి వరాలు ఉంటాయని ఆసక్తి మధ్య తరగతి వర్గం పద్దులో ఏం కోరుకుంటోంది? *సామాన్యులకు ఊరటనిచ్చేలా బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు ఉండనున్నాయి?
2021-22 కేంద్ర బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మునుపెన్నడూ చూడని అసాధారణ పరిస్థితుల్లో ఈ సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా వల్ల ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో మధ్య తరగతి వర్గం పద్దులో ఏం కోరుకుంటోంది? సామాన్యులకు ఊరటనిచ్చేలా బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు ఉండనున్నాయి? బడ్జెట్‌లో సగటు జీవి సంగతేంటో.. ఇప్పుడు చూద్దాం.
2021-22 కేంద్ర బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో బడ్జెట్‌లో ఎలాంటి ఉద్దీపనలు ఉండొచ్చనే అంశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్‌లో వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమైనా వరాలు కురిపిస్తారా? ఆదాయపు పన్ను తగ్గిస్తారా? ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది.
గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి బడ్జెట్ ఉండబోతోందని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు, ఉద్దీపన ప్యాకేజ్‌లపై ప్రభుత్వం పంపిన సంకేతాలతో భిన్న వర్గాల ప్రజలు బడ్జెట్‌లో ఎలాంటి వరాలు ఉంటాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గడిచిన ఏడాదిలో రాబడి తగ్గడం, అధిక ఖర్చుల వంటి ప్రతికూలతలు ఎదురైనా ఆర్థిక వ్యవస్ధను తిరిగి గాడినపెట్టేందుకు ప్రభుత్వం భారీ వ్యయాలను వెచ్చించకతప్పని పరిస్థితి నెలకొంది.
గతంలో ఆదాయపు పన్ను విధానంలో మార్పులు తీసుకొచ్చారు. కొత్త పన్ను విధానాన్ని కూడా ఆప్షన్‌గా ఇచ్చారు. పన్ను చెల్లంపుదారులు దేనిలో ఎక్కువ లబ్ధి ఉంటే దానిని ఎన్నుకున్నారు. కానీ, అది స్వల్ప మొత్తంలోనే లబ్ధి చేకూర్చింది. కానీ, ఇప్పుడు స్వల్ప మొత్తం లబ్ధితో బండి నడిచే పరిస్థితి లేదు. వివిధ రకాల పెట్టుబడుల్లో నిధులను ఉంచడం వల్ల లభించే సెక్షన్ 80సీ మొత్తాన్ని 1.5లక్షల రూపాయలు నుంచి మరింత పెంచాల్సి ఉంది. వాస్తవానికి దీనిని సవరించి కూడా కొన్నేళ్లవుతోంది. అందుకే దీనిని 2.5 లక్షల రూపాయల నుంచి 3లక్షలకు పెంచాలని కోరుతున్నారు. లేకపోతే ఆదాయాన్ని బట్టి సెక్షన్80సీ పరిధి వర్తించేలా చూడాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. అంతేకాదు బీమాలో టర్మ్ ప్లాన్లు తీసుకోవడాన్ని ప్రోత్సహించేలా సెక్షన్ 80సీలో మార్పులు చేయాలి.
ఇప్పటికే ఇళ్ల కొనుగోళ్లపై సెక్షన్ 80సీ అండ్ సెక్షన్ 24బీ కింద మినహాయింపులు అందుతున్నాయి. ప్రభుత్వం గృహ రుణాలపై మూలమొత్తం చెల్లింపులో ఇచ్చే రాయితీని 1.5 లక్షల నుంచి రూ.2.5లక్షలకు పెంచాల్సి ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మరింత ఊతం ఇవ్వనుంది. అంతేకాదు సెక్షన్ 24బీ కింద పన్ను పరిధిలోని ఆదాయ తగ్గింపు 5లక్ష రూపాయలకు పెంచాల్సి ఉంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ, పింఛన్లు వంటివే ప్రధాన జీవనాధారాలు. ఈ నేపథ్యంలో వారికి లభించే వడ్డీలో ఎక్కువ మొత్తం పన్ను పరిధిలోకి రాకుండా ఆర్థిక మంత్రి చర్యలు తీసుకోవాలి.
ప్రజలను ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై ఇచ్చే రాయితీని లక్ష రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉంది. ఈక్విటీ పెట్టుబడులపై ప్రభుత్వం విధిస్తున్న పన్నులను తగ్గిస్తే రిటైల్ ఇన్వెస్టర్లు పెద్దమొత్తంలో లబ్ధి పొందుతారు. ప్రస్తుతం వీటిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 10 శాతం వరకు ఉంటోంది. లక్షరూపాయల మించిన ఆదాయంపై వీటిని విధిస్తున్నారు. ఈ పన్ను తొలగింపు మార్కెట్లలో కూడా జోష్ నింపుతుంది. చూడాలి సామాన్యులకు ఊరటనిచ్చేలా బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు ఉంటాయో?