బీహార్‌లో తారుమారైన ఎగ్జిట్ అంచనాలు
బిహార్‌లో ఎప్పుడూ జరిగేదే మళ్లీ రిపీట్ అయింది ! ఎగ్జిట్ పోల్స్ అన్నీ మహాకూటమిదే అధికారం అని చెప్పగా.. ఫలితాలు మాత్రం రివర్స్ అయ్యాయ్. ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.
బిహార్‌లో ఎప్పుడూ జరిగేదే మళ్లీ రిపీట్ అయింది ! ఎగ్జిట్ పోల్స్ అన్నీ మహాకూటమిదే అధికారం అని చెప్పగా.. ఫలితాలు మాత్రం రివర్స్ అయ్యాయ్. ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. దీంతో బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయ్. బిహార్‌లో ఎన్డీయే కూటమి 57 స్థానాల్లో గెలిచి.. మొత్తం 128 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా.... ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమి 45 నియోజకవర్గాల్లో విజయం సాధించి మొత్తం 108 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 2, ఇతరులు 10స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
మొత్తం 243స్ధానాలున్న బిహార్ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే అవసరమైన మేజిక్ ఫిగర్ 122 స్థానాల్లో విజయం సాధించాలి. ఐతే ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. మరోవైపు బిహార్‌లో అర్ధరాత్రి దాటేవరకూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో... పూర్తి ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత.. ఆర్జేడీ ఏళ్ల కల నిజం అవుతుందని అంతా భావించారు. ఐతే ఫలితాల తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే దేశవ్యాప్తంగా 11రాష్ట్రాల్లో 59అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 59 స్థానాల్లో దాదాపు 40కిపైగా సీట్లలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 28అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా 21చోట్ల కమలం పార్టీ గెలుపు దిశగా పయనిస్తోంది. గుజరాత్‌లోనూ జరిగిన 8స్థానాలను బీజేపీ క్లీన్‌స్వీప్ చేసేదిశగా వెళ్తోంది. మరో కీలక రాష్ట్రమైన యూపీలోనూ ఐదు స్థానాల్లో కమలం పార్టీ ముందుంది. మరో రెండు స్థానాల్లో సమాజ్‌వాది పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఒకస్థానానికి ఉపఎన్నిక జరగ్గా కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్ ఇక్కడ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. గుజరాత్‌లో ఎనిమిది స్థానాల్లో బీజేపీ అన్నింటా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ రెండు పార్టీల మధ్య దాదాపు 20శాతం ఓట్ల తేడా ఉంది. బీజేపీ ఇప్పటివరకు 54శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్‌కు 34శాతం ఓట్లు మాత్రమే వచ్చాయ్. హర్యానాలో ఒక స్థానానికి ఎన్నిక జరుగగా.. ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
జార్ఖండ్‌లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఒక స్థానంలో, జేఎంఎం మరోస్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కర్ణాటకలో మఉపఎన్నికలు జరిగిన రెండుస్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ కూడా కమలం పార్టీకి భారీ ఆధిక్యం వచ్చే అవకాశాలు ఉన్నాయ్. మధ్యప్రదేశ్‌లో 28స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 20సీట్లలో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. మరో ఏడు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉంది. వీటిలో ఎక్కువ సిట్టింగ్ సీట్లు కాంగ్రెస్‌వే. ఇక మణిపూర్‌లో ఐదు స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇప్పటికే మూడు స్థానాల్లో బీజేపీ, మరోస్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. మరో స్థానంలో కమలం పార్టీ అభ్యర్థి ముందంజలో ఉంది.