Delhi Liquor Scam Case: దేశంలో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్

Delhi Liquor Scam Case: లిక్కర్ కుంభకోణంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణ

Update: 2022-12-03 02:15 GMT

Delhi Liquor Scam Case: దేశంలో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తల్లో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి హైదరాబాద్‌కు లింకుందని ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ప్రాథమిక ధర్యాప్తులోనే వెల్లడైంది. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తీగలాగితే... డొంక కదిలినట్లు... లిక్కర్ కుంభకోణంకేసు ధర్యాప్తు ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలినుంచి ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతూనే ఉంది.

ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా.. హోల్‌సేల్ లిక్కర్ బిజినెస్ జోన్లవారీగా చేజిక్కించుకోడానికి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించారనేది అభియోగం. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న లిక్కర్ పాలసీ అక్రమసంపాదనకు ఊతమిచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కోట్లాది రూపాయలు ముడుపుల రూపంలో చేతులు మారాయనే ఆరోపణలు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంపై సమగ్ర ధర్యాప్తు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆదేశాలతో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అక్రమాలు జరిగాయని వెల్లువెత్తిన ఆరోపణలపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాతో పాటు పలువురు అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై ఆగస్టు 19న సీబీఐ కేసు నమోదు చేసింది. లిక్కర్ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ లోతుగా ధర్యాప్తు చేసింది.

దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో హైదరాబాద్‌లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. రాబిన్ డిస్లరీ పేరుతో వ్యాపారం చేసిన రామచంద్ర పిళ్లైకి.. ఢిల్లీ లిక్కర్ స్కాంతో లింకులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇండో స్పిరిట్ తోపాటు.. కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి రూ.2 కోట్ల 30 లక్షలు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు అనుమానించారు. రాబిన్ డిస్టలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీల్లో పనిచేస్తున్న బోయినపల్లి అశోక్, బంజారాహిల్స్‌ వ్యాపారవేత్త వెన్నమనేని శ్రీనివాసరావుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దశలవారీగా సాగిన అరెస్టుల పరంపరలో కీలక సమాచారాన్ని రాబట్టారు.

ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారి, ఇండో స్పిరిట్‌ కంపెనీ యజమాని సమీర్‌ మహేంద్రును అదుపులోకి తీసుకోగా.. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో గ్రూప్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి బినోయి బాబును ఈడీ అరెస్టుచేసి దశలవారీ విచారణ చేపట్టింది. దిల్లీకి చెందిన మద్యం వ్యాపారి, ఇండో స్పిరిట్‌ కంపెనీ యజమాని సమీర్‌ మహేంద్రును అదుపులోకి తీసుకోగా.. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో గ్రూప్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి బినోయి బాబును ఈడీ అరెస్టు చేసి కీలక సమాచారాన్ని సేకరించింది. దిల్లీ మద్యం కేసులో శరత్‌ చంద్రారెడ్డి కీలక సూత్రధారిగా కస్టడీ రిమాండ్‌ రిపోర్టులో ఈడీ వెల్లడించింది. దిల్లీ లిక్కర్‌ మార్కెట్‌లో 30శాతం తన గుప్పిట్లో ఉంచుకుని, బినామీ కంపెనీల ద్వారా శరత్‌ చంద్రారెడ్డి 9 రిటైల్‌ జోన్స్‌ పొందారని రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు. శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే సౌత్‌గ్రూప్‌ ద్వారా రూ.100 కోట్లు ముడుపులు చెల్లించారనే అభియోగాలు రిమాండు నివేదికలో పొందుపరిచారు. శరత్ చంద్రారెడ్డి, విజయ్‌నాయర్‌ ద్వారా ముడుపులు పంపినట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సౌత్ గ్రూప్ బినామీల ద్వారా 9 రిటైల్ జోన్లు నిర్వహించినట్లు గుర్తించారు. ఇది మద్యం పాలసీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. ట్రైడెంట్, అర్గనోమిక్స్, అవంతిక ద్వారా ఐదు రిటైల్ జోన్లను శరత్ నిర్వహించగా, కార్టెల్ లోని ఇతర సభ్యులతో కలిసి మరో నాలుగు జోన్లు నిర్వహించారు. బినామీలు, ముడుపులు ఇవ్వడం, అక్రమ లావాదేవీల ద్వారా లిక్కర్ మార్కెట్ ను శాసించినట్లు ఈడీ అధికారులు, సీబీఐ అధికారులు నివేదికలు రూపొందించారు. విజయ్ నాయర్ ద్వారా సౌత్ గ్రూప్ కార్టెల్ , ఇతర రిటైల్ జోన్లు 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఢిల్లీలోని మద్యం ఉత్పత్తిదారులు, హోల్ సేలర్లు, రీ టెయిలర్స్ తో కూడిన అతిపెద్ద కార్టెల్ సౌత్ గ్రూప్ అనే కంపెనీ పేరు గడించింది.

అరబిందో గ్రూప్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి సతీమణి కనికా టేక్రివాల్‌ 'జెట్ సెట్ గో' పేరుతో ప్రైవేటు జెట్ చార్టర్డ్‌ విమాన సర్వీసులు నడుపుతున్నారు. ఈ విమాన సర్వీసులద్వారా లిక్కర్‌ కుంభకోణానికి సంబంధించిన ముడుపులు తరలించినట్లు ఈడీ, సీబీఐ అధికారుల ధర్యాప్తులో వెల్లడైంది. 18 జోన్లకు సంబంధించి తొమ్మిది లిక్కర్ కంపెనీలకు హైదరాబాద్ వ్యాపారవేత్తలతో లింకులను గుర్తించారు. దిల్లీ మద్యం ముడుపులతో ఈ సంస్థలన్నింటికీ సంబంధం లేకపోయినా నిధుల మళ్లింపు తీరు చట్ట విరుద్ధమని భావించిన ఎన్ఫో్ర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆర్ధికనేరాలకింద కేసు నమోదుచేసింది.

మద్యం సిండికేట్‌తో సంబంధాలున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు అత్యంత సన్నిహితులు అమిత్ అరోరాను అరెస్టుచేశారు. ఈయన గురుగ్రామ్‌లోని బుడ్డీ రిటైల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నారు. అమిత్ అరోరా అరెస్టుతో రూపొందించిన రిమాండ్ రిపోర్టులో 36 మంది వ్యాపారులు, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఫోన్‌ కాల్‌ డేటా, సంప్రదింపుల వివరాలు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన సమచారంతో రిమాండ్ రిపోర్టు రూపొందించారు. అమిత్ అరోరాతో సంబంధం ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు అభియోగాలపై వివరణ కోరుతూ, కీలక సమచారంగా వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారు.

Tags:    

Similar News