Coronavirus Updates in India: దేశంలో కోరలు చాస్తున్న కరోనా.. భారీగా కొత్త కేసులు
Coronavirus Updates in India: దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోతుంది. రికార్డుస్థాయిలో రోజురోజుకీ కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన వ్యక్తమవుతోంది.
Coronavirus Updates in India: దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోతుంది. రికార్డుస్థాయిలో రోజురోజుకీ కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కరోజే 19,906 కేసులు నమోదు కావడంతో దేశంలో కేసుల సంఖ్య 5,28,859 దాటేయగా.. మరణాల సంఖ్య 16,095కు చేరాయి. నిన్న ఒక్క రోజే 410 మంది కరోనాతో మరణించారు.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 3,09713 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 58.13 శాతంగా నమోదైంది. అలాగే, 16,095 మంది మృతిచెందడంతో... మరణాల రేటు దాదాపు 3శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 2,03051 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,31,095 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 82,27,802కి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ పరిస్థితుల్లో దేశంలో కరోనా తీవ్రతపై కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్దన్ నేతృత్వంలోని మంత్రుల ప్రత్యేక బృందం 17వ సారి సమావేశమై కట్టడి చర్యలపై సమీక్షించింది. కేంద్ర మంత్రి హర్షవర్దన్ మీడియాతో మాట్లాడారు.. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో 85.5 శాతం, ఇప్పటివరకు నమోదైన మరణాల్లో 87% కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నట్టు వెల్లడించారు. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ ,తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రాలకు సాంకేతికంగా సహాయం అందజేయడానికి వైద్య నిపుణులు, ప్రత్యేక అధికారులతో కూడిన 15 బృందాలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలకు కేంద్రం అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే కేంద్ర బృందం గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది.