Coronavirus Threat: ఎక్కువ సేపు కదలకుండా కూర్చునే వారికి కరోనా ముప్పు!
Coronavirus Threat: ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని పనిచేసే వారికి కరోనా ముప్పు పొంచి వుందట.
Coronavirus Threat: మారుతున్నకాలానికి అనుగుణంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో శారీరక శ్రమ అధికంగా చేసేవారు. కానీ ఇప్పుడు మానసిక శ్రమ అధికంగా వుంటుంది. ఫలితంగా అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. గత సంవత్సర కాలంగా కరోనా కారణంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీంతో గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారు. పైగా పని అయిపోయేంతవరకు నోట్లో ఏదో ఒకటి వేసుకుని నములుతూనే ఉంటారు. ఇది ఎంత అపాయకరమో ఎవరైనా ఆలోచించారా? ఆఫీసులో ఉంటే కనీసం 5-10 నిమిషాలైనా అటూ ఇటూ నడుస్తూ సహోద్యోగులతో మాట్లాడుతారు. కానీ ఇప్పుడు కూర్చున్న చోటు నుంచి అంగుళం కూడా కదలట్లేదు. అలా కదలకుండా కూర్చుని పనిచేసే వారికి కరోనా మహమ్మారి ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.
గత రెండేళ్లుగా ఎలాంటి శారీరక శ్రమ చేయని వారే కొవిడ్ బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్నట్టు అమెరికాలోని కాలిఫోర్నియో శాన్‌డీగో యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఐసీయూలో చేరి ప్రాణాలు కోల్పోయిన వారిలోనూ వీరి సంఖ్యే ఎక్కువని తేలింది. ఏదో ఒక రూపంలో శారీరక శ్రమ చేసే వారిలో కరోనా ముప్పు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు.
దీర్ఘకాలిక జబ్బులున్నవారికి...
అలాగే, ధూమపానం, ఊబకాయం, మధుమేహం, బీపీ, గుండె జబ్బులు, కేన్సర్ తదితర జబ్బులతో బాధపడుతున్న వారికి కూడా కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో శారీరక శ్రమ చేయని వారికి కరోనా ముప్పు మరింత ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమైందన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం, కొవిడ్ మార్గదర్శకాలను పాటించడంతోపాటు చిన్నపాటి వర్కవుట్లు, నడక, పరుగు, శారీరక శ్రమను కలిగించే పనులు చేయాల్సిందేనంటున్నారు నిపుణులు. అంతేకాకుండా పడకపై పని చేసుకునే దురలవాటుకు ముగింపు పలకాలి. ఎందుకంటే ఇది మీలో గజిబిజిని పెంచి క్రమంగా ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట చేసే వ్యాయామం మీ శరీరానికే కాకుండా మానసికంగా కూడా ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. అంతే కాకుండా కరోనా ముప్పు నుండి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.