Corona Virus: కరోనా ఉద్ధృతి.. 2021లో ఇదే తొలిసారి! వైద్యఆరోగ్యశాఖ హెచ్చరిక
Corona Virus: కరోనా రక్కసి ముప్పు తొలిగిపోయిందని అంతా భావించారు.
Corona Virus: గత కొన్నిరోజులుగా కరోనా వైరస్ కేసులు తగ్గముఖం పట్టాయని.. దీంతో కరోనా రక్కసి ముప్పు తొలిగిపోయిందని అంతా భావించారు. అయితే కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లి కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంతో వైద్యఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ ముప్పు పూర్తిగా తొలిగిపోయిందని భావన సరివికాదని వైద్యఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది.
గత నెల రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆరోగ్యశాఖ సూచిస్తోంది. తెలంగాణలో వారం రోజుల కేసుల నమోదు సరళిని పరిశీలిస్తే సుమారు 14 జిల్లాల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. ఈనెల 3న 152 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కేవలం 5వతేదీనే 170 కేసులు రికార్డయ్యాయి. మార్చి 9న 189 కేసులు.. తాజాగా 10వ తేదీన 194 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.
ఇక జీహెచ్‌ఎంసీలో 27 కొత్త కేసులు నమోదవగా.. తాజాగా బుధవారం 35 నిర్ధారణ అయ్యాయి. అలాగే కరీంనగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాల్లో కొత్త కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 194 కొవిడ్ కేసులు నమోదవగా, మొత్తం బాధితుల సంఖ్య 3,00,536కు పెరిగింది. మహమ్మారితో మరో 3 మరణాలు సంభవించగా, ఇప్పటివరకు 1,649 మంది కరోనా కారణంగా మరణించారు.
ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల పాజిటివ్ కేసులును పరిశీలిస్తే మార్చి 8న 74 కేసులు నమోదు కాగా.. మార్చి 9న 118 కేసులు, 10న 120 కేసులు, 11వ తేదీన 174 కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో 47,803 నమూనాలను పరీక్షించగా.. 0.36శాతం కేసులు నమోదయ్యాయి. కరోనాతో చిత్తూరు జిల్లాలో ఇద్దరు మరణించారు. అత్యధికంగా చిత్తూరులో 60 కేసులు, కృష్ణా జిల్లాలో 26, విశాఖపట్నంలో 23 కేసులు నిర్థారణ అయ్యాయి.
మరోవైపు ఎండలు పెరుగుతుండటంతో పలు రకాల వ్యాధులు కూడా విజృంభించే ప్రమాదం ఉంది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చిన వారికి అవసరమైన పరీక్షలు చేసి, చికిత్స అధించాలని ఆదేశించింది. జలుబు, జ్వరం, దగ్గ వంటి లక్షణాలున్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని ఆరోశాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. కొత్తగా 22,854 మంది వైరస్ బారినపడ్డారు. 2021లో తొలి సారి ఈ స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 126 మంది మృతిచెందడంతో కొవిడ్ మరణాలు 1,58,189కి పెరిగాయి. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 1,12,85,561కి చేరాయి.