Corona Updates: మహారాష్ట్రలో ప్రారంభమైన కరోనా సెకండ్ వేవ్
Corona Updates: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
Corona Updates: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని... అది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందని మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని... ఈ నేపథ్యంలో కంటైన్మెంట్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని లేఖలో మహారాష్ట్ర సర్కార్ ని రాజేశ్ భూషణ్ హెచ్చరించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనాను గుర్తించడం, టెస్టింగ్, ఐసొలేషన్ (ట్రాక్, టెస్ట్, ఐసొలేట్) వంటి చర్యలను కట్టుదిట్టంగా చేపట్టడం లేదని ఆయన అన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా కరోనా విస్తరిస్తోందని దానికి తగిన విధంగా చర్యలను తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నారో...ఇప్పుడు మళ్లీ అలాంటి చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ లో 204 పాజిటివ్ కేసులు...
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 60,263 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1656కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 170 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,97,851కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,015 ఉండగా.. వీరిలో 624 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 92,99,245కి చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో 47 పాజిటివ్ కేసులు...
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న47 మంది కరోనా బారినపడ్డారు. 22,604 నమూనాలను పరీక్షించగా.. 0.65 శాతం మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కేసులు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన వారి ద్వారా కేసులు అధికంగా నమోదవుతున్న కారణంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఒంగోలు, చీరాల, మార్కాపురం, కందుకూరులోని బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పోలీసుల సాయంతో ప్రయాణికులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేసి పంపిస్తున్నారు.
పత్తికొండలో కరోనా కలకలం...
కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా కలకలం రేపింది. ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను మూసేశారు. రెండు రోజలు క్రితం పాఠశాలలోని ఇద్దరు విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. వారిని నిన్న ఆస్పత్రికి తీసుకెళ్లి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో యాజమాన్యం ఇవాళ నుంచి పాఠశాల మూసేస్తున్నట్లు ప్రకటించింది.