కరోనావైరస్ రెండవ దశకు చేరిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మరోసారి విజృంభిస్తున్న కోవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమనాలను రద్దు (International Flights Suspended) చేసింది. కొన్ని ప్రత్యెక రోట్లలో మాత్రమె పరిస్థితులకు అనుగుణంగా విమానాలను ( International Flights) నడపనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం వెల్లడించింది.
కొవిడ్-19కు సంబంధించిన ప్రయాణ, వీసా పరిమితులు పేరుతో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 26న విడుదల చేసిన సర్క్యులర్‌కు మార్పులు చేస్తున్నామని, అన్ని అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నది. డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలు, కార్గో విమానాలకు ఈ నిబంధనలు వర్తించవు.
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 44,489 మందికి కరోనా (Coronavirus Pandemic) నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 92,66,706 కి చేరింది.
ఇక గత 24 గంటల్లో 36,367 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల సమయంలో 524 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,35,223 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,79,138 మంది కోలుకున్నారు. 4,52,344 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.