Congress President Election: నామినేషన్లు దాఖలు చేసిన శశిథరూర్, ఖర్గే, కేఎన్‌ త్రిపాఠి

Congress President Election: ఏఐసీసీ అధ్యక్ష బరిలో తప్పని త్రిముఖ పోటీ

Update: 2022-09-30 11:16 GMT

Congress President Election: నామినేషన్లు దాఖలు చేసిన శశిథరూర్, ఖర్గే, కేఎన్‌ త్రిపాఠి

Congress President Election: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ పదవికి పోటీ చేస్తానని అందరికంటే ముందే ప్రకటించిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. డప్పు వాయిద్యాలు, అభిమాన కార్యకర్తల గణంతో థరూర్‌ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీకి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ వేసేముందు థరూర్‌ రాజ్‌ఘాట్‌ వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కూడా నామినేషన్‌ వేశారు. అధ్యక్ష పదవికి ఆయన చివరి నిమిషంలో బరిలోకి దిగారు. ఈ పదవికి పోటీ చేయాలని పార్టీ హైకమాండ్‌ ఖర్గేను కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖర్గేకు మద్దతుగా మరో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పోటీ నుంచి వైదొలిగారు. గాంధీ విధేయుడిగా పేరున్న ఖర్గేకు హైకమాండ్‌ మద్దతుతో పాటు పార్టీలో అత్యధికుల అండ ఉంది. అశోక్‌ గెహ్లాట్, దిగ్విజయ్‌, ముకుల్ వాస్నిక్‌ వంటి సీనియర్‌ నేతలు సహా జీ23 నేతలైన మనీశ్ తివారీ, ఆనంద్‌ శర్మ వంటి వారు కూడా ఖర్గేకే మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన గెలుపు ఖాయమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అధ్యక్ష పదవికి మరో నామినేషన్‌ కూడా దాఖలైంది. అధ్యక్ష పదవికి తాను కూడా పోటీ చేస్తున్నట్లు ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కేఎన్‌ త్రిపాఠి ప్రకటించారు. ఆయన కూడా శుక్రవారం నామినేషన్‌ వేశారు. నామపత్రాల దాఖలుకు శుక్రవారమే చివరి రోజు. అక్టోబరు 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 8 వరకు గడువు ఉంది. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే అక్టోబరు 17న ఎన్నిక నిర్వహించనున్నారు. అక్టోబరు 19న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags:    

Similar News